ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. 18 ఏళ్లకు ఛాంపియన్‌గా మారిన ఈ జట్టు గత ఏడాది విజయం గాలివాటం కాదని నిరూపిస్తోంది. అద్భుతమైన ఆటతీరుతో వరుసగా రెండో ఏడాది కూడా ఫైనల్ చేరుకుంది. క్వాలిఫైయర్-1లో గుజరాత్ టైటాన్స్‌పై 92 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సత్తా చాటి రెండో టైటిల్‌ను ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఏకంగా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటీదార్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. 33 బాల్స్‌లో 9 సిక్సర్లు, 5 ఫోర్లతో 93 పరుగులు చేశాడు. స్టార్ బ్యాటర్ కోహ్లీ (43), కృనాల్ పాండ్య (43) కూడా రాణించారు. అనంతరం 255 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ తొలి పవర్ ప్లేలోనే తన ఓటమిని అంగీకరించింది. 19.3 ఓవర్లలో 162 పరుగులకే చాప చుట్టేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్ తీవ్రంగా నిరాశపరిచారు. అయితే గుజరాత్‌కు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంది. ఆ జట్టు ఈనెల 29న క్వాలిఫైయర్-2లో ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో తలపడనుంది.
