2026 ఐపీఎల్ సీజన్ అంచనాలకు భిన్నంగా సాగుతోంది. టైటిల్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో వెనుకపడిపోగా.. ఎలాంటి అంచనాలు లేని పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఓటమి అనేది లేకుండా దూసుకుపోతోంది. 7 మ్యాచ్‌లలో ఆరు విజయాలతో 13 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది. కోల్‌కతాతో జరగాల్సిన మ్యచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే 3 సార్లు ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ పడుతూ లేస్తూ తన ప్రయాణాన్ని సాగిస్తోంది. తాజాగా లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన KKR రింకూ సింగ్ (83 నాటౌట్) వీరవిహారంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో కూడా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులే చేయగలిగింది. దాంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో కోల్‌కతా తమ అనుభవజ్ఞుడైన స్పిన్నర్ సునీల్ నరైన్‌పై నమ్మకం ఉంచింది. ఆ నమ్మకాన్ని నరైన్ నిలబెట్టాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి నికోలస్ పూరన్, మార్క్‌రమ్‌లను ఔట్ చేశాడు. అనంతరం రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన KKR తరఫున రింకూ సింగ్ ఫోర్ కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ ఓటమితో లక్నో వరుసగా ఐదో పరాజయాన్ని మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. కాగా ఈ సీజన్‌లో ఇదే తొలి సూపర్ ఓవర్ మ్యాచ్ కావడం విశేషం.
