ఐపీఎల్ 2026 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లకు ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారయ్యాయి. అయితే అందరికంటే ముందే ప్లేఆఫ్స్ బెర్త్ సాధిస్తుందని అనుకున్న జట్టు పంజాబ్ కింగ్స్. ఆ జట్టు తొలి ఏడు మ్యాచ్‌లలో ఓటమి అనేది లేకుండా ఆరు విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మిగిలిన ఏడు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధిస్తే ప్లేఆఫ్స్ చేరుతుందని భావించిన జట్టు ఆ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. వరుసగా ఆరు గెలుపులు సాధించిన జట్టు వరుసగా ఆరు ఓటములు చవిచూసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఒక జట్టు హోంగ్రౌండ్‌గా ఒక చోటే అన్ని మ్యాచ్‌లు ఆడుతుంది. కానీ గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరహాలో ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ రెండు మైదానాలను హోంగ్రౌండ్లుగా మార్చుకుంది. ముల్లాన్‌పూర్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట్లో విజయం సాధించిన పంజాబ్ జట్టు ధర్మశాలలో మాత్రం ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. అయితే ఆర్సీబీ కూడా చిన్నస్వామిలో కాకుండా నయా రాయ్‌పూర్‌లో హోంమ్యాచ్‌లు ఆడింది. కానీ ఆ జట్టు రాయ్‌పూర్ చేరేసరికే పాయింట్ల పట్టికలో మంచి పొజిషన్‌లో నిలిచింది. కానీ పంజాబ్ కింగ్స్ చేతులారా చేసుకుని వరుసగా ఆరు మ్యాచ్‌లలో ఓడింది. చివరి మ్యాచ్‌లో గెలిచినా ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరుతుందన్న నమ్మకం లేదు. రెండు హోంగ్రౌండ్లలో ఆడటమే పంజాబ్ కొంప ముంచిందని సోషల్ మీడియాలో నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు.
