Breaking News

వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ ఫిక్స్

1 0

టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోకు చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే 2001లో నువ్వు నాకు నచ్చావ్, 2004లో మల్లీశ్వరి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించకపోయినా మాటల రచయిత, స్క్రీన్ ప్లే విభాగాల్లో పనిచేశారు. రచన కారణంగానే ఆ సినిమాలు హిట్ అయ్యాయి. సుమారు 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబోలో ఆదర్శ కుటుంబం అనే సినిమా తెరకెక్కుతోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానరుపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి తాజాగా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆదర్శ కుటుంబం ఇంటి తలుపులు ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు తెరుచుకుంటాయని.. ప్రతి ఫ్యామిలీ ఈ డేట్ గుర్తు పెట్టుకోవాలని మూవీ టీం సూచించింది. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ఇది 77వ సినిమా కావడం విశేషం. ఈ మూవీలో అతడు దృశ్యం సినిమా తరహాలో ఇద్దరు పిల్లల తండ్రిగా నటిస్తున్నాడు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్‌గా అలరించబోతున్నాడు. ఈ మూవీకి ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 2024లో విడుదలైన గుంటూరు కారం మూవీ తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న మూవీ ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.