17 ఏళ్ల పాటు సుదీర్ఘంగా నిరీక్షించి గత ఏడాది ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్‌గా నిలిచింది. 18వ ఏడాది, 18వ నంబర్ జెర్సీ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఇది మరపురాని విజయంగా నిలిచింది. అయితే ఇది గాలివాటం కాదని నిరూపిస్తూ వరుసగా రెండో ఏడాది ఆర్సీబీ టైటిల్ కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులే చేయగలిగింది. ఛేదనలో ఆర్సీబీకి మెరుపు ఆరంభం లభించింది. వెంకటేష్ అయ్యర్ (32), కోహ్లీ (75 నాటౌట్) రాణించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కోహ్లీకే లభించింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ బ్యాటింగ్ కంటే బౌలింగ్ అలరించడం విశేషం. భువనేశ్వర్, హేజిల్‌వుడ్, రసిక్ సలామ్, కృనాల్ పాండ్య అద్భుతంగా రాణించారు. తొలుత కొన్ని మ్యాచ్‌లకు హేజిల్‌వుడ్ దూరమైనా జాకబ్ డఫీ ఆ లోటు తెలియకుండా పూడ్చగలిగాడు. ఇక బ్యాటింగ్‌లో కోహ్లీపైనే అతిగా ఆధారపడకుండా కెప్టెన్ రజత్ పటీదార్, పడిక్కల్, టిమ్ డేవిడ్ తమ వంతు పాత్ర పోషించారు.
