Breaking News

ఆల్‌టైం రికార్డును వదులుకున్న క్రికెటర్

1 0

సాధారణంగా ఆటలో ఎవరైనా రికార్డుల కోసమే ఆడతారు. ఎందుకంటే తాము భౌతికంగా లేకపోయినా రికార్డులు శాశ్వతంగా చరిత్రపుటల్లో నిలిచిపోతాయని ఆటగాళ్లు భావిస్తుంటారు. అయితే ఇటీవల ఓ క్రికెటర్ ఆల్‌టైం రికార్డును సాధించే అవకాశాన్ని చేజేతులా వదులుకున్నాడు. అతడెవరో కాదు దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ వియాన్ ముల్డర్. టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటి వరకు అత్యధిక వ్యక్తిగత స్కోరు వెస్టిండీస్ ఆటగాడు బ్రియాన్ లారా పేరిట ఉంది. అతడు 2004లో ఇంగ్లండ్‌పై 400 నాటౌట్‌తో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ రికార్డుకు దరిదాపుల్లో ఎవరూ రాలేకపోయారు. కానీ జింబాబ్వేపై రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు ముల్డర్‌కు ఈ అవకాశం వచ్చింది. అయినా 367 నాటౌట్‌ దగ్గర ఉన్నప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచాడు. అదేంటని అడిగితే లారాపై గౌరవంతోనే ఇలా చేశానని చెప్పుకొచ్చాడు. అసలు లారా తన దేశమే కాకపోయినా ముల్డర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. లెజండ‌రీ క్రికెట‌ర్ సాధించిన గొప్ప రికార్డును అలాగే ఉంచాల‌ని, అదే త‌న‌కు ఇచ్చే గౌర‌వ‌మ‌ని తెలిపాడు. గ‌తంలో ఆస్ట్రేలియా క్రికెట‌ర్ మార్క్ టేల‌ర్ కూడా ఇలాగే ఆలోచించి డాన్ బ్రాడ్‌మ‌న్ 334 ప‌రుగుల రికార్డును బ్రేక్ చేయ‌కుండా అదే వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.