Breaking News

బాక్సాఫీస్ దగ్గర ‘పెద్ది’ టార్గెట్ ఎంత?

0 0

టాలీవుడ్‌లో పెద్ద సినిమా వచ్చి చాలా కాలమైంది. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత భారీ బడ్జెట్ సినిమా రాలేదు. సమ్మర్ సీజన్ మొత్తం వృథా అయిపోవడంతో థియేటర్లు డల్‌గా మారిపోయాయి. చాలా చోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలవుతోంది. ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు గేమ్ ఛేంజర్ వంటి డిజాస్టర్ తర్వాత చెర్రీ నుంచి వస్తున్న మూవీ కూడా కావడం మెగా అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో పెద్ది ముందు భారీ టార్గెట్ నిలిచింది. పాజిటివ్ టాక్ వస్తే రూ.150 కోట్ల షేర్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఓవర్సీస్‌లో అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. తెలంగాణలో టిక్కెట్ రేట్ల పెంపు లేకపోవడం కూడా మైనస్. ఏపీలో మాత్రం టిక్కెట్ రేట్ల పెంపు ఉంటుంది. పర్సంటేజ్ విధానం ఈ సినిమాకు లేకపోవడం కొంచెం ఊరట కలిగించే విషయం. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. దేవర తర్వాత జాన్వీకపూర్ మరోసారి టాలీవుడ్‌లో పెద్ది సినిమాలో హీరోయిన్‌గా నటించింది. మరి ఈ అదనపు ఆకర్షణలు పెద్ది సినిమాను కాపాడతాయో లేదో చూడాలి.