Breaking News

బిగ్‌బాస్ సీజన్-10.. ‘అగ్నిపరీక్ష’ నుంచే విమర్శలు

1 0

తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 10 ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పటికే 9 సీజన్‌లను విజయవంతంగా అందించిన స్టార్ మా ఛానల్ 10వ సీజన్‌ను సెప్టెంబర్ తొలివారం నుంచి ప్రసారం చేయనుంది. అయితే సీజన్ సీజన్‌కు విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో 10వ సీజన్‌కు ఏకంగా అగ్నిపరీక్ష నుంచే విమర్శల వర్షం ప్రారంభమైంది. కామన్ మ్యాన్ కేటగిరీలో సామాన్యులను హౌస్‌లోకి పంపించడానికి ‘అగ్నిపరీక్ష’ పేరుతో ఒక షోను ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది ఈ షో కూడా అభాసుపాలవుతోంది. మొత్తం 25వేలకు పైగా దరఖాస్తులు రావడంతో అందులో నుంచి 70 మందిని ఎంపిక చేసి పలు టెస్టుల తర్వాత 15 మందిని అగ్నిపరీక్ష కోసం నిర్వాహకులు సెలక్ట్ చేశారు. వారిలో ఆరుగురిని మాత్రమే బిగ్ బాస్ హౌస్‌లోకి పంపే అవకాశాలు ఉన్నాయి.

అయితే అగ్నిపరీక్ష కోసం వచ్చి ఎలిమినేట్ అయిన వారిలో చాలామంది పలు ఇంటర్వ్యూలలో షాకింగ్ కామెంట్లు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఉప్పల్ బాలు అగ్నిపరీక్షలో సెలక్షన్ ప్రాసెస్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేయగా.. నవదీప్ వివరణ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనను అవమానించారని ఉప్పల్ బాలు ఆరోపించడంతో ఇది ఒక ప్రక్రియ అని.. మానసికంగా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో తెలుసుకునేందుకే తాము ఇలా చేశామని నవదీప్ వివరణ ఇచ్చాడు. మరోవైపు మరో కంటెస్టెంట్ కూడా అగ్నిపరీక్షపై ఫైర్ అయ్యాడు. అమ్మాయిలు, అబ్బాయిలను వేర్వేరుగా చూస్తున్నారని.. అమ్మాయిలకు ఫేవర్‌గా మాట్లాడుతున్నారని కామెంట్ చేశాడు. అబ్బాయిలు వస్తే వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే షో నుంచి ఎలిమినేట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే కొందరు మాత్రం అగ్నిపరీక్ష పారదర్శకంగానే జరుగుతోందని.. డబ్బులు తీసుకుని ఆఫర్ ఇస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని చెప్తున్నారు.