టాలీవుడ్‌లో కొంతకాలంగా రెంటల్ సిస్టమ్, పర్సంటేజీ సిస్టం అంటూ రచ్చ నడుస్తోంది. నిర్మాతలు రెంటల్ సిస్టమ్ కావాలని.. ఎగ్జిబిటర్లు (థియేటర్ ఓనర్లు) పర్సంటేజీ సిస్టమ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. రెంటల్ విధానంలో తమకు రెవెన్యూ మిగలడం లేదని.. ఎన్నో కష్టాలను అనుభవించి థియేటర్లను రెన్నోవేషన్ చేస్తుంటే ఆ ఖర్చు కూడా తిరిగి రావడం లేదని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెంటల్ విధానం కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా థియేటర్ల సంఖ్య తగ్గిపోతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే పర్సంటేజీ విధానంలో నిజాయితీ లేదని తాజాగా ఓ ఘటన నిరూపిస్తోంది. రెంటల్, పర్సంటేజీ విధానాలపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ ఓ స్కామ్ బయటపడింది. సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ మూవీకి షాద్‌నగర్ సాయిబాబా థియేటర్‌లో ఈనెల 20వ తేదీ సెకండ్ షోకు 302 టికెట్లు అమ్ముడుపోయాయి. అయితే రికార్డుల్లో 227 టిక్కెట్లు మాత్రమే అమ్ముడైనట్లు చూపించారు. దీంతో థియేటర్ వాళ్లు స్కాం చేసినట్లు బహిర్గతం అయింది. ఈ తతంగం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పర్సంటేజీ సిస్టంతో నిర్మాతకు నష్టమేనని నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. టికెట్ సేల్స్‌పై లైవ్ ట్రాకింగ్ ఉంటే ఈ తరహా మోసాలను జరగవని అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో A సెంటర్లలో అయితే ఆన్‌లైన్ బుకింగ్ విధానం వర్కవుట్ అవుతుంది కానీ బి, సి సెంటర్లలో ఎంతమంది ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొంటారన్న పాయింట్ ఆసక్తి రేపుతోంది. మొత్తంగా చూసుకుంటే పర్సంటేజీ విధానంలో నిజాయితీ లేదని మరోసారి నిరూపితం అవుతోంది. బిజినెస్ అంటే నమ్మకం మీద జరిగేది కానీ ఈ నమ్మకం పోగొట్టుకునేలా ఎగ్జిబిటర్లు వ్యవహరించడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
