Breaking News

రాజు వెడ్స్ రాంబాయి మూవీకి అవార్డుల పంట

0 0

తెలంగాణ కల్ట్ రూరల్ మూవీగా తెరకెక్కిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. థియేటర్లలో, ఓటీటీలో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు 2025 సంవత్సరానికి గానూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లోనూ ఈ మూవీ సత్తా చాటింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గాయకుడు, స్పెషల్ జ్యూరీ.. ఇలా నాలుగు ప్రధాన కేటగిరీల్లో ఈ సినిమా అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ దర్శకుడిగా సాయిలు కంపాటి, ఉత్తమ గాయకుడిగా అనురాగ్ కులకర్ణి, స్పెషల్ జ్యూరీగా చైతన్య జొన్నలగడ్డ గద్దర్ అవార్డులను స్వీకరించనున్నారు.

“రాజు వెడ్స్ రాంబాయి” చిత్రాన్ని డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌, బన్నీ వాస్, వంశీ నందిపాటి కూడా సంయుక్తంగా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. కాగా 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సర్టిఫికేట్ పొందిన చిత్రాలను గద్దర్ అవార్డులకు ఎంపిక చేశారు. ఉగాది సందర్భంగా మార్చి 19న ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ ప్రదానం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.