టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మన శంకరవరప్రసాద్ గారు మూవీతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి బయ్యర్లకు మంచి లాభాలను అందించింది. అయితే ఇది ఫక్తు కామెడీ ఎంటర్టైనర్ మూవీ. ఈ సినిమాలో మెగాస్టార్‌కు లవ్ స్టోరీ కూడా ఉంటుంది. నయనతారను తొలిచూపులోనే ప్రేమించి చిరు పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. 60 ఏళ్ల వయసు దాటినా చిరు లవ్ స్టోరీలు చేయడం డ్యూయట్ సాంగ్‌లకు స్టెప్పులు వేయడం సగటు సినీ అభిమానులకు నచ్చడం లేదు. ఖైదీ నంబర్ 150లో కాజల్ అగర్వాల్‌తో, వాల్తేరు వీరయ్యలో శ్రుతి హాసన్‌తో కూడా చిరు లవ్ స్టోరీలు ఉంటాయి. అయితే అవి చాలా ఎబ్బెట్టుగా అనిపించడంతో చిరు తన వయసుకు తగ్గ పాత్రలు చేయడం లేదని సినీ విశ్లేషకులు విమర్శించారు. అయినా చిరులో పెద్ద మార్పేమీ రాలేదు. ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ వంటి వరుస పరాజయాలు చిరును ఆలోచింపచేశాయి. అనిల్ రావిపూడి తెరకెక్కించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో ఇద్దరు పిల్లలకు తండ్రిగా నటించినా సూపర్ హిట్ కావడం కూడా చిరులో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బాబీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో చిరు మరోసారి ఫాదర్‌గా కనిపించబోతున్నాడు. కట్ చేస్తే.. నందమూరి బాలయ్య ఇటీవల వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. అఖండ-2 అనుకున్న ఫలితాన్ని సాధించకపోయినా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహరాజ్ లాంటి సినిమాల్లో బాలయ్య తన వయసుకు తగ్గట్లుగా లవర్ బాయ్‌గా కాకుండా ఫాదర్గానే కనిపించి మంచి మార్కులు కొట్టేశాడు. దీంతో మెగాస్టార్ కూడా బాలయ్యను ఫాలో కావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఒకవైపు తన కుమారుడు రామ్‌చరణ్ లవర్ బాయ్ పాత్రల్లో నటిస్తున్న వేళ తాను కూడా లవర్ బాయ్ పాత్రల్లో కనిపించడం సమంజసం కాదని చిరు గ్రహించాడు. దీంతో వాల్తేరు వీరయ్య ఫేం దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న మూవీలో వయసు మళ్లిన పాత్రలో చిరు కనిపించబోతున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో చిరు కూతురి పాత్ర కోసం పలువురు పోటీ పడుతున్నారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ చుట్టూ ఈ కథ నడుస్తుందని ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. చిరు కూతురి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో ఆ పాత్రలో ఎవరు నటిస్తారన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. తొలుత కృతి శెట్టి పేరు వినిపించగా తర్వాత బాలనటి నుంచి హీరోయిన్గా మారిన సారా అర్జున్ పేరు కూడా వినిపించింది. తాజాగా ఈ కీలక పాత్ర కోసం మరో యువ నటి పేరు ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ఛాంపియన్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ ఈ పాత్రకు దాదాపు ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తండ్రి–కూతురు మధ్య బలమైన ఎమోషనల్ ట్రాక్ ఈ సినిమాకు హైలైట్ కానుందని, అందుకే ఈ పాత్ర ఎంపికలో దర్శకుడు బాబీ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య కూతురిగా యువ హీరోయిన్ శ్రీలీల మెప్పించగా.. ఆమె కూడా రోషన్ హీరోగా నటించిన పెళ్లిసందడి మూవీతోనే ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇప్పుడు కూడా రోషన్ సరసన నటించిన హీరోయినే చిరు కూతురిగా కనిపించబోతోంది. మరి బాలయ్య తరహాలో చిరు కూడా హిట్ అందుకుంటాడో లేదో కాలమే సమాధానం చెప్పాలి. ఈ మూవీలో చిరు సరసన ప్రపంచ మాజీ సుందరి ఐశ్వర్యరాయ్ హీరోయిన్గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి పేరు ఫిక్స్ అయింది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకా విశేషం ఏంటంటే.. తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా చిరు, బాలయ్య, నాగ్, వెంకీ సినిమాలు సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్ దగ్గర తలపడబోతున్నట్లు అందరూ చర్చించుకుంటున్నారు.
