టాలీవుడ్లో రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి ఒక్క పరాజయం లేకుండా ముందుకు సాగుతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బంపర్ హిట్ అందుకున్న అతడు వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా తన సినిమాతో అభిమానులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర్ వరప్రసాద్ గారూ’ మూవీని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాంలో గోదారి గట్టుపైన రామచిలకవే పాట తరహాలో ఇప్పుడు చిరు మూవీలో మీసాల పిల్ల సాంగ్ అందరినీ అలరిస్తోంది. పూర్తి పాట రిలీజ్ కాకముందే ఈ పాట సోషల్ మీడియాలో హోరెత్తిస్తోంది. ఉదిత్ నారాయణ్ పాడిన ఈ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. అందరూ ఈ పాటతో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొన్ని సంస్థలు అయితే ఏకంగా తమ ప్రమోషన్ కోసం ఈ పాటను వాడుకోవడం ఆసక్తికరంగా మారింది. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నాడు. మొత్తంగా చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి మరో పెద్ద హిట్ అందుకునేలా కనిపిస్తున్నాడు.
