Breaking News

డబ్బింగ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచడమేంటి?

1 0

ఉంటే అతివృష్టి.. లేకపోతే అనావృష్టి.. ఇదే లోకం తీరు. ఇది ఏపీ ప్రభుత్వం తీరు కూడా. గతంలో తెలుగు సినిమాలకు కూడా రేట్లు పెంచని సర్కారు పెద్దలు.. ఇప్పుడు డబ్బింగ్ సినిమాకు కూడా రేట్లు పెంచడం హాట్ టాపిక్‌గా మారింది. అసలు స్టోరీలోకి వెళ్తే.. నాలుగేళ్ల కిందట ఏపీలోని జగన్ సర్కారు తెలుగు సినిమాలకు చాలా తక్కువ టిక్కెట్ రేట్లు నిర్ణయిస్తూ జీవోలు జారీ చేసింది. దీంతో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించిన మేకర్స్, డైరెక్టర్స్, హీరోలందరూ అప్పటి సీఎం జగన్ దగ్గరకు క్యూ కట్టారు. జగన్ ఎంతలా అవమానించినా కిక్కురుమనలేదు. దేహి అంటూ తమ సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచాలని అడుక్కున్నారు. ఈ జాబితాలో దర్శక దిగ్గజం రాజమౌళి కూడా ఉన్నాడు. ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం జక్కన్నకు ఈ తిప్పలు తప్పలేదు. కట్ చేస్తే.. ఇప్పుడు ఏపీలోని కూటమి సర్కారు తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలకు కూడా టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి జీవోలు జారీ చేయడం సామాన్యుడికి అంతుచిక్కని విషయంలా మారింది. ఒకవైపు కర్ణాటకలో తెలుగు సినిమాలను వరుసపెట్టి అడ్డుకుని అవమానిస్తుంటే.. కన్నడ సినిమా కాంతార చాప్టర్-1 మూవీకి టిక్కెట్‌పై రూ.50, రూ.100 పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం తెలుగు ప్రేక్షకులకు నచ్చడం లేదు. సామాన్య ప్రేక్షకులంటే ప్రభుత్వానికి అంత అలుసు ఎందుకు అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా తమ నిట్టూర్పును కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా డబ్బింగ్ సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచకూడదని అల్టీమేటం జారీ చేస్తున్నారు.