వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ‘దేవదాసు’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ఇలియానా. ఆ తర్వాత పోకిరి, జల్సా, రాఖీ, కిక్ వంటి వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే దేవదాసు కంటే ముందే ‘బర్ఫీ’ అనే మూవీతో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టింది. కెరీర్ తొలినాళ్లలో హిట్ సినిమాలతో అలరించిన ఇలియానా ఒక దశలో గడ్డుకాలాన్ని ఎదుర్కొంది. ఆమె నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. తెలుగులో ఆమె నటించిన ఆఖరి మూవీ అమర్ అక్బర్ ఆంటోనీ. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజతో కలిసి ఆడిపాడింది. ఆ తర్వాత ఒకట్రెండు చిత్రాల్లో బాలీవుడ్లో నటించినా అనంతరం మొత్తానికే సినీ పరిశ్రమకు బైబై చెప్పేసింది. పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలైపోయింది. ప్రస్తుతం తన భర్త మైఖేల్ డోలన్‌తో కలిసి అమెరికాలోని టెక్సాస్‌లో జీవిస్తోంది. ప్రస్తుతం ఇలియానా దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే త్వరలో ఇలియానా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది. పెళ్లి, పిల్లల కారణంగా కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె నటనకు గుడ్‌బై చెప్పలేదని, సరైన సమయంలో తప్పకుండా రీఎంట్రీ ఇస్తానని ప్రకటించారు. రీఎంట్రీ ప్రకటనతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సరైన మూవీతో వెండితెరపై సందడి చేయాలని మనసారా ఆకాంక్షిస్తున్నారు.
