Breaking News

సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కొత్త లోక’

1 0

మలయాళంలో తెరకెక్కిన చాలా సినిమాలు టాలీవుడ్‌లో ఆదరణ దక్కించుకున్నాయి. గత ఏడాది ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ ఈ కోవలోకే వస్తాయి. ఈ ఏడాది కూడా మలయాళ మూవీ ‘కొత్త లోక- చాప్టర్1’ సెన్సేషనల్ హిట్ సాధించింది. ఎలాంటి ప్రమోషన్‌లు లేకుండా విడుదలైన ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో వసూళ్లు దక్కుతున్నాయి. వార్-2, కూలీ తర్వాత నారా రోహిత్ ‘సుందరకాండ’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం సంతృప్తికర స్థాయిలో లేవు. అయితే ‘కొత్త లోక’ సినిమా మాత్రం ఆదరణ దక్కించుకుంటోంది. ప్రేమలు ఫేం నస్లేన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ‘హలో’ మూవీ ఫేం కళ్యాణి ప్రియదర్శన్ కీలక పాత్ర పోషించింది. చంద్ర అలియాస్ నీలిగా ఆమె నటన చాలా బాగుంది. ఒక మిషన్‌లో భాగంగా ఆమె శత్రువుల నుంచి తృటిలో తప్పించుకుంటుంది. దీంతో మూతోన్ ఆమెను రహస్యంగా ఉండాలని హెచ్చరిస్తాడు. అయితే పక్కింట్లో ఉండే నస్లేన్ ఆమెతో పరిచయం పెంచుకుని ప్రేమలో పడతాడు. ఈ నేపథ్యంలో చిక్కుల్లో పడతాడు. అసలు నస్లేన్‌కు ఈ పరిస్థితి వస్తుందో అన్న పాయింట్ మిగతా కథ. ఇండియన్ సూపర్ హీరో సినిమాగా ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగిస్తుండటంతో అందరూ ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేయడం గమనించాల్సిన విషయం. వార్-2తో నష్టపోయిన ఈ బ్యానర్ కొత్త లోక మూవీతో వసూళ్ల పంట అందుకుంటోంది.