Breaking News

రజనీ క్రేజ్: విడుదలకు ముందే రూ.100 కోట్లు

1 0

సినీ పరిశ్రమలో ప్రతి వారం సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. అయితే ఒకే వారం ఒకేసారి క్రేజ్ ఉన్న సినిమాలు రిలీజ్ కావడం అరుదుగా జరుగుతాయి. సంక్రాంతి లేదా పండగ సీజన్‌లలో మాత్రమే ఈ పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఆగస్టు 15 లాంగ్ వీకెండ్ రావడంతో రెండు క్రేజ్ ఉన్న సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన వార్-2 మూవీ, రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర నటించిన ‘కూలీ’ ఒకేరోజు అంటే ఆగస్టు 14న విడుదలవుతున్నాయి. రెండూ మల్టీస్టారర్ సినిమాలు కావడం ఒక ఎత్తు అయితే.. ఈ రెండూ డబ్బింగ్ సినిమాలు కావడం మరో విశేషం. డబ్బింగ్ సినిమాలు అయినా టాలీవుడ్‌లో ఈ రెండు సినిమాల క్రేజ్ చూస్తే బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా అని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీ మూవీ ‘కూలీ’పై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో బుకింగ్ ఓపెన్ చేసిన కాసేపటికే ఈ సినిమా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బుకింగ్‌ల ద్వారా తొలిరోజే రూ.100 కోట్ల వసూళ్లు వస్తాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు తొలిరోజే రూ.100 కోట్ల సినిమా రాలేదు. గేమ్ ఛేంజర్, హరిహర వీరమల్లు సినిమాలు ఈ ఫీట్ అందుకుంటాయని అంచనా వేసినా అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇప్పుడు డబ్బింగ్ సినిమా కూలీ ఈ ఫీట్‌ను సాధించనుంది. అటు వార్-2 మూవీ కూడా వసూళ్లలో పోటీ పడుతోంది. అయితే ఎన్టీఆర్ ఉన్నప్పటికీ ఎందుకో కూలీతో పోలిస్తే బుకింగ్స్‌లో కాస్త వెనుకపడింది. బహుశా ‘వార్-2’ యాక్షన్ జోనర్ కావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా వైపు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. విడుదల తర్వాత ఈ రెండు సినిమాలలో విజేత ఎవరో అన్న ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది.