టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. దాదాపుగా పదేళ్ల నుంచి తారక్ కెరీర్లో ఓటమి అనేదే లేదు. 2015లో వచ్చిన టెంపర్ మూవీ నుంచి 2024లో విడుదలైన దేవర మూవీ వరకు తారక్ వరుస విజయాలను అందుకున్నాడు. దీంతో ఎన్టీఆర్ ఇమేజ్ రెట్టింపు అవుతూనే ఉంది. ఇక ఈ ఏడాది బాలీవుడ్ మూవీ వార్-2తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. హృతిక్ రోషన్‌తో తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకుని మరో మల్టీస్టారర్ మూవీతో రికార్డులను కొల్లగొట్టేందుకు తారక్ సిద్ధమయ్యాడు. వార్-2 తర్వాత సలార్ ఫేం దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. అతడి కెరీర్లో ఇది 31వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. కానీ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఈ టైటిల్ పెట్టడం అనుమానంగా మారింది. ఎందుకంటే ఇటీవల ఇదే టైటిల్‌తో తమిళ డబ్బింగ్ మూవీ విడుదలై మంచి విజయం సాధించింది. లవ్ టుడే ఫేం హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌గా తెలుగులో విడుదల కాగా 100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. యూత్, ఫ్యామిలీలకు ఈ సినిమా బాగా నచ్చడంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తోంది. అయితే ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు ఏడాది గ్యాప్‌లో రావడం ఎప్పుడూ జరగలేదు. ఇటీవల తమిళంలో శివ కార్తీకేయన్ , విజయ్ ఆంటోనీ సినిమాలకు ఒకే టైటిల్ పెట్టడం వివాదంగా కూడా మారింది. ఇప్పుడు ఈ వివాదం టాలీవుడ్‌కు పాకేలా కనిపిస్తోంది. ఎందుకంటే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీని అందరూ డ్రాగన్ అనే పిలుస్తున్నారు. ఇప్పుడు తారక్ సినిమాకు డ్రాగన్ అని పెడితే నెగిటివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని టాలీవుడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఒకవేళ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఫ్లాప్ అయితే ఈ రచ్చ ఉండేది కాదు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది కాబట్టి తారక్ మూవీకి టైటిల్ మారే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరోవైపు తారక్, నీల్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ పాన్ ఇండియా ప్రాజెక్టు కాబట్టి కచ్చితంగా టైటిల్ మార్చాల్సిందేనని మేకర్స్ ఆలోచనలో పడినట్లు సమాచారం అందుతోంది. తారక్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్‌కు డ్రాగన్ టైటిల్ కరెక్టుగా ఉంటుందని అందరూ భావించారు. ఫ్యాన్స్ కూడా ఈ టైటిల్ బాగుందని కామెంట్లు చేశారు. దీంతో ‘డ్రాగన్’ టైటిల్ తోనే ఈ ప్రాజెక్టును పిలుచుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇదే టైటిల్‌తో ఓ సినిమా రావడం, హిట్ అవడం జరిగిపోయాయి. మరి ఎన్టీఆర్ మూవీకి అదే టైటిల్ ఉంచుతారా లేదా ఛేంజ్ చేస్తారా అన్న విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే విషయం నిర్మాత రవిశంకర్‌ను అడిగితే అదే టైటిల్ ఉన్న సినిమా హిట్ కావడం తమ సినిమాకు ప్లస్ అవుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో తారక్, ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ టైటిల్‌తోనే విడుదలవుతుందని కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. తొలిరోజే 3వేల మందితో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా రెండు పార్టులుగా వస్తుందని ప్రచారం జరుగుతోంది. అటు తారక్‌కు, ఇటు ప్రశాంత్ నీల్‌కు మంచి బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి రెండు పార్టులుగా సినిమా చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ తీసిన రెండు సినిమాలు సీక్వెల్ నేపథ్యంలోనే తెరకెక్కడం జరిగింది. కేజీఎఫ్, కేజీఎఫ్-2 గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ప్రభాస్‌తో తీసిన సలార్-1 కూడా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. ఎన్టీఆర్‌తో సినిమా తర్వాతే సలార్-2 మూవీ తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తారక్ మూవీ కూడా హిట్ అయితే సలార్-2 తర్వాత డ్రాగన్-2 వచ్చే ఛాన్స్ ఉంటుంది.
