Breaking News

జిన్నా కంటే గాలోడు బెటర్.. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్

1 0

టీవీ నుంచి సినిమాల్లోకి ఎదిగిన నటుల్లో సుడిగాలి సుధీర్ ఒకడు. అతడు ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించినా అవి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. గతంలో సాఫ్ట్‌వేర్ సుధీర్, త్రీ మంకీస్, ఎందుకో ఏమో, వాంటెడ్ పండుగాడ్ వంటి సినిమాలలో నటించినా ఆ సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. అయితే ఎట్టకేలకు సుడిగాలి సుధీర్ సుడి తిరిగినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం సుధీర్ నటించిన గాలోడు సినిమా అతడి ఖాతాలో హిట్ వేసిందనే చెప్పాలి. ఈ సినిమా గురించి విడుదలకు ముందు యూనిట్ సభ్యులు ఎక్కడా ప్రమోట్ చేయలేదు. కానీ అనూహ్యంగా గాలోడు మూవీ మొదటి నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయినట్లు ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

తొలిరోజు రూ.1.21 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ రెండో రోజు కూడా అదే స్థాయిలో వసూళ్లను రాబట్టింది. రెండో రోజు గాలోడు మూవీ రూ.1.14 కోట్ల గ్రాస్ సాధించింది. మూడో రోజు ఆదివారం కావడంతో ఈ మూవీ వసూళ్లు పెరిగాయి. మూడో రోజు రూ.1.61 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో మొదటి మూడు రోజుల్లో గాలోడు మూవీ రూ.4 కోట్ల గ్రాస్, రూ.2.25 కోట్ల షేర్ సొంతం చేసుకుంది. సుధీర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచిపోయింది. కాగా ఈ మూవీ రూ.3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఇంకా రూ.75 లక్షలు మాత్రమే రావాల్సి ఉండటంతో నాలుగో రోజే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ నమ్ముతోంది. కాగా ఇటీవల మంచు విష్ణు తెగ ప్రచారం చేసుకున్న జిన్నా మూవీని మించి గాలోడు మూవీ వసూళ్లు రాబట్టడంతో అందరూ విష్ణు కంటే సుధీర్ బెటర్ అనే అభిప్రాయానికి రావడం గమనించాల్సిన విషయం.