దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తండ్రితో కలిసి నటించిన ఆచార్య సినిమా విడుదలైనా.. ఆ మూవీ చెర్రీ ఖాతాలో ఉందని అభిమానులే మరిచిపోయారు. అయితే ఆర్.ఆర్.ఆర్ విడుదలై రెండేళ్లు దాటిపోయినా ఇప్పటివరకు చెర్రీ నుంచి సోలో సినిమా రాలేదు. ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ శంకర్ ఇండియన్-2పై తన దృష్టి పెట్టడంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఎట్టకేలకు నెలరోజుల కిందట ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. దిల్ రాజు పలు ఈవెంట్లలో ఈ సినిమా క్రిస్మస్‌కు రిలీజ్ అవుతుందని చెప్పడంతో డిసెంబర్ 20న గేమ్ ఛేంజర్ విడుదలవుతుందని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ వాళ్లపై మరోసారి మెగా బాంబ్ పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఐకాన్ స్టార్ పుష్ప సినిమానే అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ డిసెంబర్ 6న విడుదలకు సిద్ధమైంది. రెండు వారాల తేడాతో గేమ్ ఛేంజర్ వస్తే అటు పుష్ప-2 మూవీకి, ఇటు గేమ్ ఛేంజర్ మూవీకి ఇబ్బంది అవుతుందని డిస్ట్రిబ్యూటర్లు అన్నారని.. ఇది బిజినెస్ పరంగా మంచి నిర్ణయం కాదని దిల్ రాజుకు వివరించినట్లు కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో గేమ్ ఛేంజర్ విడుదలను వాయిదా వేసి సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటికే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీని షెడ్యూల్ చేశారు. బింబిసార ఫేం దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభర మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం విశ్వంభరలో గ్రాఫిక్స్ కోసం దర్శకుడు టైం అడిగాడని.. దీంతో ఈ మూవీ సంక్రాంతికి రావడం లేదని తెలుస్తోంది.
విశ్వంభర వాయిదా పడటంతో గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు తన సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని ఫిక్స్ అయినట్లు విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. అధికారికంగా దీనిపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేకపోయినా అటు గేమ్ ఛేంజర్, ఇటు విశ్వంభర సినిమాలు వాయిదా పడినట్లు మెగా అభిమానులకు స్పష్టం అవుతోంది. అయితే పుష్ప2 కారణంగా గేమ్ ఛేంజర్‌ను వాయిదా వేయడం తమకు నచ్చలేదని మెగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బన్నీ దెబ్బకు అబ్బాకొడుకులు పారిపోయారని అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ పుష్ప2 సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే నాలుగు వారాల పాటు బాక్సాఫీస్ దగ్గర దున్నేస్తామని బన్నీ ఫ్యాన్స్ స్పష్టం చేస్తున్నారు. టాక్ అంతంత మాత్రంగా ఉన్న దేవర సినిమాకే రికార్డు స్థాయిలో వసూళ్లు వస్తుంటే.. దేవర కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న పుష్ప2 సినిమాకు మంచి టాక్ వస్తే రికార్డులన్నీ తమ హీరో వశం అవుతాయని లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు సంక్రాంతి సెలవులు గేమ్ ఛేంజర్‌కు అడ్వాంటేజ్ అవుతాయని.. 30 ఏళ్లుగా అటు చిరుపై, ఇటు చెర్రీపై ఏడుస్తున్న వాళ్లందరి గూబ గుయ్యిమనేలా తాము రికార్డులు కొల్లగొడతామని చెర్రీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ రికార్డులను కూడా తిరగరాస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే డిసెంబర్ 6న వస్తాడనుకుంటున్న పుష్ప2 ఒకరోజు ముందు అంటే డిసెంబర్ 5నే వస్తాడని ప్రచరం జరుగుతోంది. దీంతో ప్రస్తుతం దేవర ఏదైతే అడ్వాంటేజ్ తీసుకున్నాడో దానికి రెట్టింపు స్థాయిలో పుష్పరాజ్ బాక్సాఫీస్‌ను దున్నేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
