ఓటీటీల క్రేజ్ ఎక్కువగా మారడంతో ఇటీవల కాలంలో సినిమా పరిస్థితి దయనీయంగా తయారైంది. ఏడాదికి ఒక్క తెలుగులోనే 200 సినిమాలకు పైగా విడుదలవుతుంటే తీరా సక్సెస్ సాధించిన సినిమా సంఖ్య 15 లేదా 20ని మించడం లేదు. వీటిలో కూడా బ్రేక్ ఈవెన్ కావాలంటే 2 వారాలు తప్పనిసరి. చిన్న బడ్జెట్ సినిమా అయితే వారంలోనే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఈ నేపథ్యంలో ఓ చిన్న సినిమా రిలీజ్ రోజే బ్రేక్ ఈవెన్ కావడం విశేషం. ఆ సినిమానే లిటిల్ హార్ట్స్. రొమాంటిక్ కామెడీ జోనర్లో తెరకెక్కి సంచలన విజయం సాధించింది.
ఈటీవీ విన్లో వచ్చిన నైంటీస్ వెబ్ సిరీస్‌తో మంచి మార్కులు వేయించుకున్న యూట్యూబర్, మీమర్ మౌళి ఈ మూవీలో హీరోగా నటించాడు. నైంటీస్ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించిన ఆదిత్య హసన్ నిర్మాతగా.. సాయి మార్తాండ్ దర్శకుడిగా వ్యవహరించారు. తొలుత ఓటీటీ మూవీగా ఈ సినిమాను నిర్మించగా.. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ వీక్షించి ఇది థియేట్రికల్ మూవీ అని భావించి మంచి ప్రమోషన్లు చేశారు. దీంతో సెప్టెంబర్ 5న రూ.2.5 కోట్ల టార్గెట్‌తో లిమిటెడ్ థియేటర్లలోనే లిటిల్ హార్ట్స్ మూవీ విడుదలైంది. అయితే పెయిడ్ ప్రీమియర్లకు పాజిటివ్ టాక్ రావడంతో షోల సంఖ్య క్రమంగా పెరిగింది. ఇక తొలి రోజు రూ.3 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అదేరోజు విడుదలైన ఘాటీ, మదరాసి సినిమాలకు బ్యాడ్ టాక్ రావడం లిటిల్ హార్ట్స్ మూవీకి మరో ప్లస్ పాయింట్ అయ్యింది. దీంతో రెండో రోజు థియేటర్ల సంఖ్య, షోల సంఖ్య పెరిగింది. మొత్తానికి తొలిరోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ రెండో రోజు నుంచే నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది. ఓవర్సీస్లోనూ లిటిల్ హార్ట్స్ మూవీకి అద్భుత రీతిలో వసూళ్లు రావడం గమనించాల్సిన విషయం.
కాగా టాలీవుడ్లో ఈ ఏడాది విజయం సాధించిన 14వ సినిమా లిటిల్ హార్ట్స్. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం, తండేల్, కోర్ట్, మ్యాడ్ స్క్వేర్, హిట్-3, సింగిల్, శుభం, కుబేర సినిమాలతో పాటు మార్కో, చావా, డ్రాగన్, మహావతార్ నరసింహ, కొత్త లోక వంటి డబ్బింగ్ చిత్రాలు బ్రేక్ ఈవెన్ క్లబ్లో చేరాయి.
