ఒకప్పుడు పెళ్లి చేసుకున్న మహిళలు ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే భయపడిపోయేవారు. భర్త అనుమతి లేనిదే ఎక్కడికి వెళ్లేవారు కాదు. అసలు భర్త ఎంతమంది మహిళలతో తిరిగినా అడిగేందుకు జంకేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది. అమ్మాయిల ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది. పెళ్లి చేసుకోవడం ఆలస్యం భర్తను ఎలా హత్య చేయాలో పన్నాగాలు పన్నుతున్నారు. ఇంత ఆలోచన చేస్తున్న అమ్మాయిలు అసలు పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని ఇంట్లో చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇష్టం లేని పెళ్లి చేసుకుని భర్తలను పరలోకాలకు పంపడం ఎంత వరకు కరెక్ట్ అని కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అసలు అమ్మాయిలకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందనేది హాట్ టాపిక్ అవుతోంది. పెద్దలు చూసిన సంబంధాన్ని చేసుకున్న తర్వాత కూడా సమాజంలో మగవారికి భద్రత లేకుండా పోతోంది. ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేని భార్య, భర్తను చంపడానికి వెనకాడటం లేదు. ఇటీవల కాలంలో భర్తలపై వరుసగా భార్యలు హత్యలకు పాల్పడుతుండటంతో సమాజంలో మగవారి భద్రత, మానసిక ఆరోగ్యం పట్ల మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ ఘటనలు తెలియజేస్తున్నాయి. మరోవైపు భార్యాబాధితుల సంఘాల్లో సభ్యులు పెరిగిపోతున్నారు. మొత్తంగా భార్యలకు ఇదేం పోయే కాలం అన్న భావన ఉత్పన్నం అవుతోంది.
