రేటింగ్: 3.25/5
ఇప్పటివరకు వచ్చిన వెబ్ సిరీస్‌లలో కంటెంట్ పరంగా, ఆదరణ పరంగా ‘ఫ్యామిలీ మ్యాన్’ మంచి మార్కులు వేయించుకుంది. వెబ్ సిరీస్‌లకు పెద్దగా అలవాటు పడని కుటుంబ ప్రేక్షకులను సైతం ఈ షో ఆకట్టుకుంది. బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించిన తెలుగు దర్శక ద్వయం రాజ్-డీకే అమెజాన్ ప్రైమ్ కోసం తీర్చిదిద్దిన వెబ్ సిరీస్ ఇది. రెండేళ్ల కిందటి తొలి సీజన్‌కు కొనసాగింపుగా రాజ్-డీకే రూపొందించిన రెండో సీజన్ అంచనాల మేరకు ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
కథలోకి వెళ్తే.. దేశ రాజధాని ఢిల్లీ మీద ఉగ్రవాదుల రసాయన దాడిని శ్రీకాంత్ తివారి (మనోజ్ బాజ్ పేయి) అడ్డుకోవడానికి గట్టి ప్రయత్నమే చేసినప్పటికీ.. అప్పటికే గ్యాస్ లీక్ కావడం వల్ల 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోతారు. వేల మంది ప్రాణాలు కాపాడినప్పటికీ.. పూర్తిగా దాడిని ఆపలేకపోయామన్న అపరాధ భావం శ్రీకాంత్ టీంను వెంటాడుతుంది. ఈ పరిస్థితుల్లో కుటుంబ కారణాలు కూడా తోడై శ్రీకాంత్.. ‘టాస్క్’కు దూరం అవుతాడు. భార్యాపిల్లలు కోరుకున్నట్లే ఒక ఐటీ కంపెనీలో 9-5 ఉద్యోగంలో చేరతాడు. అయిష్టంగానే ఆ ఉద్యోగం చేస్తూ ఇంటి పనుల్లో భార్యకు సాయం చేస్తూ.. పిల్లలతో ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం చేస్తుంటాడు. ఐతే మళ్లీ ‘టాస్క్’ టీంకు ఒక పెద్ద సవాలు ఎదురవుతుంది. శ్రీలంకలో తమిళుల స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ఎల్టీటీఈకి చెందిన బృందం.. పాకిస్థాన్ ఐఎస్ఐతో కలిసి భారత ప్రధాని మీద దాడి చేసేందుకు సిద్ధమవుతుంది. దీనికి తోడు వేరే కారణాలు కూడా తోడై శ్రీకాంత్ మళ్లీ ‘టాస్క్’లోకి రాక తప్పదు. ఈ స్థితిలో తన టీంతో కలిసి ప్రధానిపై దాడిని శ్రీకాంత్ ఎలా అడ్డుకున్నాడన్నది మిగతా కథ.
ఓవైపు ఉత్కంఠ రేపుతూ.. మరోవైపు అక్కడక్కడా కుటుంబ అంశాలతోనూ ఆసక్తి రేకెత్తిస్తూ.. ఇంకోవైపు సమయోచితంగా వినోదం అందిస్తూ ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 1 తరహాలోనే సీజన్ 2 కూడా ఆకట్టుకుంటుంది. తొలి సీజన్ చూసి ఉండటం వల్ల కథ పరంగా సెకండ్ సీజన్ మరీ కొత్తగా అనిపించదు. పైగా అందులో మాదిరి విలన్ పాత్రకు సంబంధించి ఇక్కడ సర్‌ప్రైజ్ ఉండదు. కొన్ని చోట్ల కథనం కొంచెం నెమ్మదించిన భావన కలుగుతుంది. అయితే ఇవేవీ పెద్ద తప్పుల్లా కనిపించని విధంగా తొమ్మిదికి తొమ్మిది ఎపిసోడ్లలోనూ ప్రేక్షకుల దృష్టి మరలని విధంగా.. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి రేకెత్తిస్తూ సీజన్ 2 ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
తొలి సీజన్‌లో టెర్రరిస్టు మూసా పాత్ర పెద్ద ఆకర్షణ. అమాయకంగా మొదలైన ఆ పాత్ర.. చివరికి అసలు రూపం చూపించేసరికి ప్రేక్షకులు మామూలుగా థ్రిల్ అవ్వరు. ఆ షోను మరో స్థాయికి తీసుకెళ్లిన ట్విస్టు ఇది. అయితే ఈసారి ప్రధాన విలన్ పాత్రలోకి సమంతను తీసుకొచ్చారు. సమంత పాత్ర విషయంలో ముందే ఒక అంచనాకు వచ్చేశాక అక్కడి నుంచి ట్విస్టులు.. సర్‌ప్రైజ్‌లు ఆశించడానికి వీల్లేకపోయింది. ఈ కోణంలో చూస్తే సమంతను ఎంచుకోవడం షోకు మైనస్ అయినట్లే. కానీ ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో సమంత పాత్రే అది పెద్ద ఆకర్షణగా మారిందంటే అది ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం వల్లే. సమంత చేసిన రాజీ పాత్ర మొదలైన తొలి సన్నివేశం నుంచి ఆ క్యారెక్టర్ ముగిసే వరకు ఒక్క చోట కూడా స్క్రీన్ కు కళ్లప్పగించేసేలా చేస్తుందంటే అతిశయోక్తి కాదు. శ్రీలంక సైన్యం చేసిన అరాచకాలకు సర్వస్వం కోల్పోయి తన జాతి కోసం ఏదో ఒకటి చేయాలని ఎల్టీటీఈలో చేరి తక్కువ వ్యవధిలో ప్రమాదకర తీవ్రవాదిగా మారిన పాత్రలో సమంత స్టీల్ ద షో అనే చెప్పాలి.
రాజీ పాత్రను సమంత పెర్ఫామెన్స్ కోసమే ‘ఫ్యామిలీ మ్యాన్-2’ చూడొచ్చంటే అతిశయోక్తి కాదు. ఒక మామూలు అమ్మాయిలా పరిచయం చేసి.. ఆ తర్వాత ఆ పాత్ర తాలూకు అసలు స్వరూపాన్ని బయటపెట్టే సన్నివేశాలు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. పాత్ర డిమాండ్ మేరకు సమంత కెరీర్లోనే ఎన్నడూ లేనంత విధంగా డీ గ్లామరస్‌గా.. అలాగే ఎంతో ‘బోల్డ్’గా నటించిన సమంత ‘వావ్’ అనిపిస్తుంది. ఇక ‘ఫ్యామిలీ మ్యాన్-1’ను తన భుజాల మీద నడిపించిన మనోజ్ బాజ్ పేయి రెండో సీజన్లోనూ అదరగొట్టేశాడు. ఎంతో సీరియస్ గా కనిపిస్తూ అతను కామెడీ పండించిన తీరు మరోసారి షోకు హైలైట్ గా నిలిచింది. తొలి సీజన్ తో పోలిస్తే మనోజ్ పాత్ర ఈసారి మరింత వినోదాన్ని పంచుతుంది. ప్రియమణి పాత్ర అనుకున్నంత ఆసక్తికరంగా లేదు. ఆమె పాత్రను ఇంకా బాగా తీర్చిదిద్దాల్సింది.
చివరగా..‘ఫ్యామిలీ మ్యాన్-2’ ఎక్కడా బోర్ కొట్టించదు. ఎక్కడా ఓవర్ ద బోర్డ్ వెళ్లకుండా ఇన్వెస్టిగేషన్ సీన్లను వాస్తవికంగా.. ఉత్కంఠభరితంగా రాజ్, డీకే బృందం తీర్చిదిద్దారు. అక్కడక్కడా కథనం కొంచెం నెమ్మదించడం తప్పితే ‘ఫ్యామిలీ మ్యాన్-2’ అంచనాలను అందుకోవడంలో విజయవంతమైంది. తొలి సీజన్ చూడని వాళ్లను సైతం ఇది ఆకట్టుకుంటుంది. ‘ఫ్యామిలీ మ్యాన్-1’ చూస్తే దీన్ని మరింత ఎంజాయ్ చేయవచ్చు.
