తెలుగు జాతి ఉనికి కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలో భారీ కాంస్య విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ హాజరుకానున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగు ప్రజల కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా, శాఖమూరులోని 6.8 ఎకరాల సువిశాల స్థలంలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు అమరజీవి పొట్టిశ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డూండి రాకేష్ తెలియజేశారు. మార్చి 16న ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని.. తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోయే “స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్” ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. శంకుస్థాపన జరిగిన 6 నెలల్లోనే యుద్ధప్రాతిపదికన విగ్రహ ప్రతిష్టాపన పూర్తి చేసినట్లు వివరించారు. తెలుగు వారందరికీ ఇది గర్వకారణమైన సమయం అని.. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

