Breaking News

తెలుగు సినిమా ట్రెండ్ మారింది.. చెన్నకేశవరెడ్డి మళ్లీ వస్తున్నాడు

1 0

ప్రస్తుతం తెలుగు సినిమా ట్రెండ్ మారింది. ఇటీవల మహేష్ పోకిరి సినిమా స్పెషల్ షోలు టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్ చేశాయి. ముఖ్యంగా 470 షోలు ప్రదర్శించడంతో భారీ వసూళ్లు వచ్చాయి. దీంతో అగ్రహీరోల పాత సినిమాలు మళ్లీ రీ రిలీజ్‌కు ముస్తాబు అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు జల్సా సినిమాను రీ రిలీజ్ చేయగా ఏకంగా 700కి పైగా షోలను ప్రదర్శించారు. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ప్రత్యేక షోలు చూసేందుకు అభిమానులు క్యూ కడుతున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఘరానా మొగుడు సినిమాను ప్రదర్శించగా అంతంత మాత్రంగానే స్పందన లభించింది. కానీ ఇటీవల ధనుష్ నటించిన 3 సినిమాను రీ రిలీజ్ చేయగా మంచి వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పుడు ఈ నెల 25న బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాను ప్రదర్శించడానికి థియేటర్లు రెడీ అవుతున్నాయి. ఈ మూవీ విడుదలై 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఆదరణ ఎలా లభిస్తుందో చూడాలి. మాస్ సినిమా కాబట్టి వసూళ్లు బాగానే వస్తాయని ట్రేడ్ విశ్లేషకులు లెక్క కడుతున్నారు. అటు ఎన్టీఆర్ కు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ఆది, వెంకటేష్ క్లాసికల్ మూవీ క్షణం క్షణం కూడా రీ రిలీజ్ చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు కొత్త సినిమాలకు ఆదరణ లభించడం లేదు. ఈనెలలో విడుదలైన రంగ రంగ వైభవంగా, ఆ అమ్మాయి గురించి చెప్పాలి, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, కోబ్రా లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దీంతో బయ్యర్లు కూడా పాత సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్త సినిమాలను విడుదల చేసి చేతులు కాల్చుకునే కంటే పాత సినిమాలతో ఓ రూపాయి సంపాదించుకోవచ్చని ఆలోచిస్తున్నారు.