NAGARJUNA “WILD DOG” MOVIE REVIEW AND RATING
రేటింగ్: 2.75/5
హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్ల అంశంపై తెరకెక్కిన మూవీ ‘వైల్డ్ డాగ్’. వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా అన్నాక ఉన్నది ఉన్నట్లు తెరపై చూపిస్తే కుదరదు. కొన్నిచోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకుని అయినా.. థ్రిల్లింగ్ మూమెంట్స్ జోడించడం.. ట్విస్టులతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేయడం అవసరం. మరి ‘వైల్డ్ డాగ్’ దర్శకుడు సాల్మన్ అహిషోర్ ఈ కథను ఎలా తెరకెక్కించాడో చూద్దాం పదండి.
కథలోకి వెళ్తే.. ఏసీపీ విజయ్ వర్మ NIAలో నిజాయితీ పనిచేసే అధికారి. హైదరాబాద్‌లో జరిగిన గోకుల్ ఛాట్ బాంబు పేలుళ్ల ఘటనలో తన కూతురిని కోల్పోతాడు. ఇలాంటి స్థితిలో అతడు ఓ ఉగ్రవాద దాడి కేసును ఛేదించాల్సి వస్తుంది. అయితే ఈ కేసులో అతడికి అన్ని అడ్డంకులే ఎదురవుతాయి. ఈ కేసును విజయ్ వర్మ టీమ్ ఎలా ఛేదించింది అన్నదే మిగతా కథ.
ఈ సినిమా మొత్తం అండర్ కవర్ ఆపరేషన్ నేపథ్యంలో జరుగుతుంది. అయితే దర్శకుడు సూటిగా సుత్తి లేకుండా సాగిపోయేలా కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ఉగ్రవాదిని గుర్తించే సీన్లు పెద్దగా ఆకట్టుకోకపోయినా ఖలీద్ తప్పించుకునే సీన్స్ , ఛేజింగ్ సీన్స్ బాగుంటాయి. అయితే సెకండ్ ఆఫ్ అంతా నేపాల్ బేస్‌గా సాగుతుంది. అక్కడ వైల్డ్ డాగ్ టీంపై దాడి జరగటం, వారిని గుర్తించే సన్నివేశాలు… అవసరమా అనిపిస్తాయి. పైగా పెద్ద ఉగ్రవాది సెక్యూరిటీ లేకుండా పెళ్లిళ్లలకు తిరిగే సీన్ నమ్మశక్యంగా ఉండదు. ఇక క్లైమాక్స్ సీన్ బాగుంటుంది. కానీ బేబీ సినిమా చూసిన వారికి మాత్రం పాత క్లైమాక్సే కదా అనుకోవటం ఖాయం. ఉగ్రవాదిని పట్టుకునే అంశంలో ఉండే ప్రత్యేకత సినిమాలో పెద్దగా ఉండదు.
విజయ్ వర్మ పాత్రలో నాగార్జున మంచి ఎఫర్ట్ పెట్టాడు. అయితే హీరో స్వయంగా ఉగ్రవాదుల బాధితుడైనపుడు ఆ పాత్రలో ఉండాల్సినంత ఉద్వేగాన్ని తన పాత్ర ద్వారా నాగ్ చూపించలేకపోయాడు. దియా మీర్జా పాత్ర మరీ నామమాత్రంగా ఉంది. సయామి ఖేర్, అలీ రెజా సహా హీరో టీంలో ఉండే అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. అతుల్ కులకర్ణి కూడా బాగానే నటించాడు. విలన్ పాత్రలో చేసిన నటుడు ఫర్వాలేదు.
ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. ఈ మూవీకి తమన్ నేపథ్య సంగీతం ప్లస్ పాయింట్‌గా నిలిచింది. మంచి ఫామ్‌లో ఉన్న తమన్ ఈ సినిమాకు మంచి అవుట్ పుట్ ఇచ్చాడు. ఎన్నో పరిమితుల మధ్య దర్శకుడు సాల్మన్ కథను బాగానే తెరకెక్కించినా స్క్రీన్‌ప్లేలో మరిన్ని మార్పులు చేస్తే మంచి ఫలితం ఉండేది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. షనీల్ డియో ఛాయాగ్రహణం కూడా సినిమాను నిలబెట్టింది.
చివరగా.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో సాగే వైల్డ్ డాగ్ కథ పరంగా థ్రిల్లింగ్ చేయకపోయినా కథనం పరంగా సీట్లో కూర్చోబెడుతుంది. ఉగ్రవాది హీరో టీమ్ చేతికి చిక్కాక ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి ఇండియాకు తీసుకువచ్చే ఎపిసోడ్ మాత్రం ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్లు ఇష్టపడే వారు ఈ మూవీని ఒకసారి చూడవచ్చు.
A REVIEW WRITTEN BY NVLR
MOVIE WATCHED: అర్జున్ (కూకట్పల్లి)