Breaking News

ఈ పంట ఖరీదు కిలో రూ.లక్ష

1 0

వ్యవసాయం అంటే చులకనగా మారిపోయిన ఈరోజుల్లో ఓ రైతు అద్భుతం చేసి చూపిస్తున్నాడు. అతడే బీహార్‌లోని అమరేష్ సింగ్. అతడు పండిస్తున్న పంట ప్రపంచంలోనే అత్యంత ఖరీదైందిగా చప్తున్నారు. ఇంతకీ ఆ పంట పేరు ‘హాప్ షూటర్’. అమరేష్ సింగ్ ‘హాప్ షూటర్స్​’ మొక్కలను ప్రయోగ పద్ధతిలో సాగు చేస్తున్నాడు. వీటి ఖరీదు వింటే మీరు ఖర్చితంగా షాక్ అవుతారు. కేజీ హాప్ షూట్స్​ధర సుమారు రూ.లక్ష వరకు పలుకుతోంది. ఈ విషయాన్ని సాక్షాత్తూ ఐఏఎస్ అధికారి సుప్రీయా సాహు ట్విటర్‌లో వెల్లడించారు. యావత్ దేశంలో తొలిసారిగా అమరేష్ ఈ పంట వేశారట. భారత రైతుల స్థితిగతులను మార్చే శక్తి ఈ పంటకు ఉందంటూ సుప్రియ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

https://twitter.com/supriyasahuias/status/1377111139914444809

ఔరంగబాద్ జిల్లా నబీనగర్‌లోని కర్మ్‌డీడ్ గ్రామానికి చెందిన అమరేష్ సింగ్ చదువుకున్నది మాత్రం ఇంటర్మీడియట్. తనకు తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న ఐదు ఎకరాల పొలంలో ఓ ప్రయోగం చేద్దామని నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ‘హాప్ షూట్’ పంటను ఒకప్పుడు మాదక ద్రవ్యంగా భావించేవారు. దీని ఉపయోగాల గురించి మరిన్ని పరిశోధనలు జరిగిన అనంతరం హాప్ షూట్‌ను బీర్ తయారీలో వినియోగిస్తున్నారు. దీని ద్వారా బీర్ మరింత వగరుగా, కాస్తంత చేదుగా మారుతుందని చెబుతున్నారు. హాప్ షూట్‌లో బ్యాక్టీరియా నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి కాస్తంత రుచిగా కూడా ఉండటంతో షెఫ్‌లు కొన్ని రకాల వంటకాల్లో దీనిని వినియోగిస్తున్నారు.

హాప్ షూట్ పంటలో కాసే పూలు, పండ్లు, కాడలను యాంటీ బయాటిక్స్​ వంటి ఔషధాల తయారీలోనూ వినియోగిస్తారు. వీటితో తయారు చేసిన ఔషధాలు టీబీ వంటి వ్యాధుల నివారణలో మెరుగ్గా పనిచేస్తాయి. ఈ మొక్కల్లో హ్యుములోన్స్, ల్యూపులోన్స్​ అనే ఆమ్లాలు ఉంటాయని, మానవ శరీరంలో క్యాన్సర్ కణాలను నిర్మూలించేందుకు ఇవి ఉపయోగపడతాయట. ఒత్తిడి, ఆందోళన, అనాల్జేసిక్​తో పాటు నిద్రలేమిని కూడా నయం చేస్తుందని చెబుతుంటారు. ఈ మొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉన్నందున ఐరోపా వాసులు సౌందర్య సాధనంగానూ ఉపయోగిస్తారు. చర్మంపై మెరుపును పెంచుకునేందుకు హాప్ షూట్స్ చిట్కాను పాటిస్తారు. కాగా 11వ శతాబ్దం తొలినాళ్లలో ఈ పంట వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.