సాధారణంగా వివాహం చేసుకునేందుకు మంచి సంబంధం కోసం మ్యాట్రిమోనిలో ప్రకటనలు ఇవ్వడం చూశాం. కానీ 73 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు తనకు వరుడు కావలెను అంటూ మ్యాట్రిమోనిలో ప్రకటన ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఓ 73 ఏళ్ల వృద్ధురాలు టీచర్‌గా పనిచేసి రిటైర్ అయ్యింది. ఆమెకు గతంలో వివాహం జరగ్గా విడాకులు తీసుకుంది. అయితే తనకు ఓ సొంత కుటుంబం లేదని, తొలి వివాహం విడాకులతో ముగిసిందని ఇప్పుడు తాను ఒంటరిగా ఉండేందుకు భయపడుతున్న కారణంగా జీవిత భాగస్వామి కోసం చూస్తున్నానని సదరు బామ్మ ప్రకటన ఇచ్చింది.

ఆమె ఇచ్చిన ప్రకటనలో తనకు ఓ వరుడు కావాలని, ఆరోగ్యవంతుడు, తన కన్నా పెద్ద వయసు గల వ్యక్తి కావాలని, ఆ వ్యక్తి తప్పనిసరిగా బ్రాహ్మణుడు అయి ఉండాలని షరతు విధించింది. ఒంటరిగా జీవించడం కష్టంగా ఉన్నందునే సంబంధం కోసం చూస్తున్నానని ప్రకటనలో వివరించింది. కాగా బామ్మ ప్రకటన చూసిన కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా కొందరు స్వాగతిస్తున్నారు. వృద్ధుల పట్ల నిరాదరణ ప్రదర్శిస్తున్న సమాజానికి ఈ ప్రకటన ఓ మేలుకొలుపు అని అంటున్నారు.