Breaking News

నితిన్ ‘రంగ్ దే’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

3 0

NITHIN RANG DE MOVIE REVIEW AND RATING

రేటింగ్: 3/5

నితిన్‌కు లవర్ బాయ్‌గా మంచి ఇమేజ్ ఉంది. గత ఏడాది వచ్చిన ‘భీష్మ’ మూవీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇటీవల వచ్చిన ‘చెక్’ మూవీ అతడిని నిరాశపరిచినా మళ్లీ లవర్‌బాయ్‌గా నటించిన ‘రంగ్ దే’ అతడి అభిమానులను అలరించేలా ఉంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కడం, దర్శకుడు వెంకీ అట్లూరి కూడా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చేలా ఈ సినిమా తీశాడు.

ఇక కథలోకి వెళ్తే..

అర్జున్ (నితిన్), అనుపమ (కీర్తి సురేష్) చిన్నప్పటి నుంచి పక్క పక్క ఇళ్లలోనే ఉంటారు. దీంతో ఇద్దరి మధ్య చదువులను అర్జున్ తండ్రి (నరేష్) కంపేర్ చేస్తూ మార్కులు తక్కువ రావడంతో అర్జున్‌ను తిడుతుంటాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో అర్జున్, అనుపమ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో వీరిద్దరి జీవితాల్లో చోటు చేసుకున్న మార్పులేంటి అన్నదే మిగతా కథ.

ఈ సినిమాలో నితిన్, కీర్తి సురేష్ జంట మధ్య కెమిస్ట్రీ బాగుంది. అదే ఈ సినిమాకు హైలెట్. ఇద్దరి మధ్య ఇగోలు, ద్వేషం, ప్రేమ అనే అంశాలను దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. ప్రేక్షకులు సైతం వీరి మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ వార్‌ను ఎంజాయ్ చేస్తారు. ఫస్టాఫ్‌ను రొటీన్ కథ, కామెడీతో దర్శకుడు నెట్టుకొచ్చేశాడు. ఫస్టాఫ్‌లో ఫారెన్ స్టడీ సెంటర్‌లో బ్రహ్మాజీ సీన్‌లు నవ్విస్తాయి. అయితే సెకండ్ హాఫ్‌ను ఎక్కువగా దుబాయ్‌లో తీశారు. వెన్నెల కిషోర్ కామెడీ అంత వర్కవుట్ కాలేదు. పెళ్లి అయిన తర్వాత నితిన్, కీర్తి సురేష్ మధ్య మంచి ఎమోషనల్ టచ్ సీన్లు పడి ఉంటే సినిమా రేంజ్ పెరిగి ఉండేది.

ఈ సినిమాకు సాంకేతిక నిపుణులు అదనపు బలాన్ని ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ దేవిశ్రీప్రసాద్ సంగీతం. ఇప్పటికే ఈ ఏడాది ‘ఉప్పెన’ వంటి మ్యూజికల్ హిట్ ఇచ్చిన దేవి ఫామ్ అందుకున్నాడు. తన ఫామ్‌ను ‘రంగ్ దే’తో దేవి కొనసాగించాడు. అందుకు తగ్గట్లే పాటలు, బీజీఎం బాగున్నాయి. ముఖ్యంగా పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం సూపర్బ్. అతడు తీర్చిదిద్దిన విజువల్స్ సినిమా లుక్‌ను మార్చింది. మిస్టర్ మజ్నుతో విఫలమైన దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకు పకడ్బందీగా సీన్లు రాసుకోవడం ఆకట్టుకుంటుంది. ఓ ఫన్ సీన్‌తో ముగింపు పలకడంతో మంచి ఫీల్‌తో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు.

చివరగా.. లీడ్ క్యారెక్టర్‌ల ప్రతిభ, దేవిశ్రీ సంగీతం, పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు ఈ సినిమాను హిట్ రేంజ్‌లో నిలబెట్టాయి. కథనం మరింత బాగుంటే సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉండేది. కానీ కామెడీ, పాటలు కోసం ఈ సినిమా తప్పనిసరిగా చూడొచ్చు. భీష్మ తర్వాత నితిన్‌కు దాదాపుగా మరో హిట్ పడినట్లే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.

A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: ప్రసాద్ మల్టీప్లెక్స్ (స్క్రీన్-3)