Breaking News

కార్తీకేయ ‘చావు కబురు చల్లగా’ మూవీ రివ్యూ

2 0

KARTIKEYA CHAAVU KABURU CHALLA MOVIE REVIEW

రేటింగ్: 2.5/5

ఆర్ఎక్స్ 100 ఒక్క సినిమాతోనే ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరో కార్తీకేయ. అయితే ఆ సినిమా ఆ తర్వాత అతడు హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. తాజాగా చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గీతా ఆర్ట్స్ బ్యానరుపై నిర్మితమైన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. ఓ కొత్త కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

కథ విషయానికి వస్తే బస్తీ బాలరాజు (కార్తీకేయ) శవాలను మోసుకెళ్లే ఓ వాహనానికి డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. తల్లి (ఆమని)తో కలిసి సామాన్యమైన జీవనం గడుపుతూ ఉండే యువకుడు. ఓ శవాన్ని కాల్చేందుకు స్మశానానికి వెళ్లిన బాలరాజుకు భర్త చనిపోయిన మల్లిక (లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె నిరాకరించినా వెంట పడుతూనే ఉంటాడు. అయితే ఓ కారణంతో తల్లిపై కోపం పెంచుకున్న బాలరాజు తల్లి ప్రేమ కంటే మల్లిక ప్రేమ గొప్పదని భావిస్తాడు. ఇంతకీ తన ప్రేమను దక్కించుకుంటాడా? తల్లి విషయంలో బాలరాజు కోపానికి కారణమేంటి? అన్నది మిగతా కథ.

ఈ సినిమాలో బస్తీ బాలరాజు పాత్రలో కార్తీకేయ చాలా హుషారుగా నటించాడు. ఎవరు చనిపోయినా తన వాహనంలో స్మశానానికి తీసుకెళ్లి, వచ్చిన డబ్బులతో తాగుతూ తిరుగుతుంటాడు. బలాదూర్ యువకులు బయట ఎలా ఉంటారో అలా సహజంగా నటించాడు. ఎమోషన్ సీన్‌లలో కూడా అతడి నటన మెప్పిస్తుంది. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి డీగ్లామరైజ్ పాత్రలో నటించింది. గంగమ్మ పాత్రలో ఆమని కూడా చాలా బాగా నటించింది. ఈ సినిమాకు ఆమె ప్లస్ పాయింట్ అంటే అతిశయోక్తి కాదు. మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

ఈ సినిమా కాన్సెప్ట్ ఎందుకు డిఫరెంట్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. చావు అనేది ఎవరికైనా వచ్చి తీరుతుంది. అయితే చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతిరోజూ బాధపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మహిళలు తమ భర్తలు చనిపోతే కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలి అంటూ అండర్ పాయింట్‌గా ఈ సినిమాలో చూపించారు. ఫస్టాఫ్ రొటీన్ కామెడీతో సాగుతుంది. భర్తను కోల్పోయిన యువతిని హీరో ప్రేమించడం అనే కాన్సెప్ట్‌ కొత్తగా అనిపించినా స్క్రీన్‌ప్లే బాగుంటే ఈ మూవీ స్థాయి మరోలా ఉండేది.

ఈ సినిమాలో తల్లి, కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త ఎమోషనల్‌గా ఉంటాయి. అయితే కొన్ని చోట్ల వచ్చే సన్నివేశాలు మరీ లాజిక్ లేకుండా సాగడం మైనస్‌గా మారింది. సినిమాలో మెయిన్ పాయింట్ కూడా సాగదీసినట్లు అనిపిస్తుంది. తొలి చిత్రంతోనే దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి కొత్త కాన్సెప్టునే ఎంచుకున్నా అనుకున్న విధంగా తెరపై ప్రజెంట్ చేయలేక తడబడ్డాడు. సినిమాలోని పాటలు ఫర్వాలేదు. ఎడిటింగ్ బాగోలేదు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు యావరేజ్ స్థాయిలోనే ఉన్నాయి.

చివరగా.. కొత్త కథ ఉన్నా, వినడానికి అది ఆసక్తికరంగా ఉన్నా.. దానికి తగ్గట్లు ముడిసరుకు లేక బోరింగ్ సన్నివేశాలతో ఈ సినిమా బోర్లా పడిందనే చెప్పాలి. కార్తీకేయ హిట్ కోసం మరో సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాను థియేటర్‌లో చూసే బదులు రెండు వారాలు ఆగి ఓటీటీలో చూడటం బెటర్. అలా కాదు అంచనాలు పెట్టుకోకుండా చూస్తాం అంటే మీ ఛాయిస్.

A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: ఏషియన్ జీపీఆర్ మల్టీప్లెక్స్ (కూకట్‌పల్లి)