Breaking News

తెలంగాణలో మరో కొత్త పార్టీ

0 0

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏమిటి? టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో పని చేసిన అయన ముందున్న, మిగిలి ఉన్న‌ ఆప్ష‌న్ బీజేపీనే కాబ‌ట్టి అంద‌రూ క‌మ‌లం గూటికి చేరతార‌ని అంచ‌నా వేస్తున్నారు. ఒక‌వేళ ఆ పార్టీ కాకుంటే ష‌ర్మిల పెట్ట‌బోయే పార్టీలో చేరే అవ‌కాశం ఉంద‌ని లెక్క‌లు వేస్తున్నారు. కానీ ఈ రెండూ కాకుండా కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి మ‌రో ఆలోచ‌న చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి‌ కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నార‌ని చెప్పుకుంటున్నారు. సొంత పార్టీ పెట్ట‌డం, ఇత‌ర పార్టీలోకి వెళ్ల‌డం.. ఏదీ మంచిద‌నే విష‌యంపై సీరియ‌స్‌గా లాభాన‌ష్టాలు బేరీజు వేసుకుంటున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉండే కొండా వారం రోజుల వ‌ర‌కూ అందుబాటులో ఉండ‌బోనంటూ ప్ర‌క‌టించ‌డానికి కార‌ణం కూడా ..ఈ బిజీలో మునిగిపోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

కొత్త పార్టీ ఏర్పాటులో భాగంగా తెలంగాణ‌లో ఇప్ప‌టికే రిజిస్ట‌రై.. ప్రచారంలోకి రాని పార్టీల వివరాలు ఆరా తీస్తున్నారని సమాచారం. ఇప్ప‌టికే కొత్త పార్టీ ఆలోచ‌న విష‌యాన్ని రంగారెడ్డి జిల్లాకు చెందిన కొంద‌రు మీడియా ప్ర‌తినిధుల‌తో ఆఫ్‌ది రికార్డ్ పంచుకోవ‌డంతో పాటు.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల‌కు సంబంధం లేకుండా రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉన్నవారి వివ‌రాలు చెప్పాల‌ని కోరార‌ట‌. ఈ క్ర‌మంలో తెలంగాణ యువ‌సేన పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్యక్షుడు అడ‌పా సురేంద‌ర్ గురించి వారు కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి చెవిలో వేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి అపాయింట్మెంట్ కోరి హాట్ టాపిక్‌గా మారారు అడప సురేందర్, అలాగే ఎమ్మెల్సీగా పోటీ చేస్తూనే శాసనమండలి రద్దు చేయాలంటూ డిమాండ్ చేసి చర్చనీయాంశమయ్యారు.

కొండాతో క‌లిసి ప‌నిచేయ‌డంపై అడ‌పా సురేంద‌ర్ అభిప్రాయాన్ని ఆయన అనుచరులు అడిగిన‌ట్టుగా స‌మాచారం. ఇద్ద‌రి మ‌ధ్య చర్ఛలు ఫలిస్తే కొండా తెలంగాణ యువసేన పార్టీ తో రీ ఎంట్రీ ఇస్తారనని టాక్ నడుస్తోంది.