Breaking News

‘గాలి సంపత్’ మూవీ రివ్యూ

2 0

RAJENDRA PRASAD, SRI VISHNU ’GALI SAMPATH’ MOVIE REVIEW AND RATING

రేటింగ్: 2.5/5

‘గాలి సంపత్’ మూవీ నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి ప్రేక్షకుల నోళ్లలో ఆడటానికి కారణం ఏకైక నటుడు, ఏకైక దర్శకుడు. వాళ్లే రాజేంద్రప్రసాద్, అనిల్ రావిపూడి. రాజేంద్రప్రసాద్ ఎందుకు విలక్షణ నటుడో ఈ సినిమా మరోసారి చాటిచెప్పింది. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించకపోయినా మాటలు, స్క్రీన్‌ప్లే అందించాడు. మరి ఈ ఎమోషన్ డ్రామా ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ విషయానికి వస్తే సూరి (శ్రీవిష్ణు), గాలి సంపత్ (రాజేంద్రప్రసాద్) తండ్రీ కొడుకులు. మాటలు రాని గాలి సంపత్ ఎప్పటికైనా నాటకాల్లో బహుమతి గెలిచి కొడుక్కి ట్రక్ ఇవ్వాలని పరితపిస్తుంటాడు. కానీ కొడుక్కి తన తండ్రి నాటకాల్లో నటించడం ఇష్టం ఉండదు. దీంతో వాళ్లిద్దరి మధ్య చిన్న గొడవలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో సంపత్ ఓ బావిలో పడిపోతాడు. తండ్రి జాడ కోసం సూరి ఏం చేశాడు, ఆ తర్వాత ఏం జరిగిందన్నదే మిగతా కథ.

ఈ సినిమాలో టైటిల్ పాత్ర పోషించిన రాజేంద్రప్రసాద్‌ తనలో నటన పరంగా అన్ని కోణాలను చూపించాడు. అతడు నూతిలో పడినప్పటి నుంచి మూవీ థ్రిల్లింగ్‌గా మారుతుంది. అయితే సంపత్ బావిలో నుంచి వచ్చే సన్నివేశాలు సినిమాలో కీలకమైనా అవి పకడ్బందీగా లేకపోవడంతో తేలిపోయాయి. ప్రకృతికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఈ కథతో దర్శకుడు ముడిపెట్టాడు. శ్రీవిష్ణు తనకు అలవాటైన పాత్రలో బాగానే నటించాడు. తండ్రి వల్ల ఇబ్బందులు పడే పాత్రలో అభినయం చూపించాడు. అయితే హీరో, హీరోయిన్‌ల లవ్ ట్రాక్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అటు కమెడియన్ సత్య కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా చిన్నది.

ఈ సినిమాలో కామెడీ వర్కవుట్ కాకపోవడమే పెద్ద సమస్యగా మారింది. సత్య, రాజేంద్రప్రసాద్ మధ్య రాసుకున్న సన్నివేశాలు తప్పితే మిగతా కామెడీ సన్నివేశాలు అవుట్ డేటెడ్‌గా అనిపించాయి. ఇది ముమ్మాటికీ దర్శకుడు అనీష్ కృష్ణ లోపమే. చాలా సన్నివేశాలు ప్రెడిక్టబుల్‌గా ఉండటం కూడా మైనస్‌గా మారాయి. అయితే ద్వితీయార్ధంలో బ్యాంక్ మేనేజ‌ర్‌, ఆడిట‌ర్ మ‌ధ్య ఎపిసోడ్స్‌, ప‌తాక స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. కథలో కొత్తదనం ఉన్నా కథనం పకడ్బందీగా ఉంటే ఈ సినిమా మరో లెవల్‌లో ఉండేది. అచ్చు సంగీతం బాగుంది. అరకు అందాలను బాగా చూపించారు. ప్రథమార్థంలో హాస్యం, పతాక సన్నివేశాలు మినహాయిస్తే మిగతా సినిమా బోరింగ్‌గా ఉంది.

చివరగా.. కథ, హాస్యం, ఎమోషన్, లవ్ ఉన్నా ఈ సినిమాలో ఒక్క విభాగం కూడా సూపర్బ్ అనే స్థాయిలో లేదు. రాజేంద్రప్రసాద్ తన నటనతో మరిపించినా దానికి తగ్గ కథనం ఉండి ఉంటే సినిమా హిట్ రేంజ్‌కు చేరి ఉండేది. అనిల్ రావిపూడి అందించిన స్క్రీన్‌ ప్లే అక్కడక్కడా కాస్త నెమ్మదించిన ఫీలింగ్ కలిగింది. రెగ్యులర్ సినిమాలకు భిన్నమైన సినిమాను కోరుకునే వారు ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు.

A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: విశ్వనాథ్ (కూకట్‌పల్లి)