NAVEEN POLISHETTY JATHI RATNALU MOVIE REVIEW AND RATING
రేటింగ్: 3/5
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో మంచి క్రేజ్ సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి నటించడంతో ‘జాతి రత్నాలు’ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ ఈ మూవీకి నిర్మాత కావడంతో ఈ క్రేజ్ మరింత ఎక్కువైంది. కథగా చూస్తే ‘జాతి రత్నాలు’ కామెడీ కోసమే తీసినట్లు అనిపించింది. కేవలం నవ్వుల్లో ముంచెత్తమే ఈ సినిమా కాన్సెప్ట్ కాబట్టి ఈ విషయంలో 95 శాతం సక్సెస్ అయ్యింది కూడా.
కథ విషయానికి వస్తే.. శ్రీకాంత్ (నవీన్), శేఖర్ (ప్రియదర్శి), రవి (రాహుల్ రామకృష్ణ) సరదాగా తిరిగే ముగ్గురు కుర్రాళ్లు. ఇంకా చెప్పాలంటే ఆవారా గాళ్లు అన్నమాట. ఉద్యోగం కోసం జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చిన వీరు ఓ క్రైమ్‌లో ఇరుక్కుంటారు. అసలు వీరు ఈ కేసులో ఎందుకు ఇరుక్కున్నారు? ఈ కేసు నుంచి ఎలా బయట పడ్డారు అన్నదే మిగతా కథ.
సోషల్ మీడియా, టీవీ షోల కారణంగా సినిమాల్లో కామెడీ పండించడం పెద్ద గగనంగా మారింది దర్శకులకు. కానీ నిజ జీవితంలో మనుషుల ప్రవర్తనను, స్నేహితుల మధ్య జరిగే సంభాషణలను తెరమీదకు తెచ్చి జోకులకు ప్రాసలు, రంగులు అద్దకుండా సహజంగా కామెడీని ఈ సినిమాలో చూపించారు. అయితే కామెడీ పండించడానికి టైమింగ్ కూడా అవసరం. అందుకు సరైన నటీనటులు కావాలి. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ ఈ సినిమాలో తమ పాత్రలను చక్కగా పోషించి కామెడీలో టైమింగ్ చూపించడంతో ‘జాతి రత్నాలు’ ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా చేస్తుంది. లాజిక్‌లు లేకుండా ఈ సినిమా బాగానే నవ్విస్తుంది.
ఈ సినిమాలో ముగ్గురు హీరోలకు స్పెషల్‌గా మేనరిజంలు పెట్టడం కామెడీ పండించడానికి మరింత స్కోప్ దొరికింది. ముగ్గురు కూడా తమ నటనతో అదరగొట్టేశారు. నవీన్‌లో చాలా టాలెంట్ ఉందని ‘జాతి రత్నాలు’మరోసారి నిరూపించింది. యూత్‌లో అతడికి మరింత ఫాలోయింగ్ పెరగడం ఖాయంగా కనపడుతోంది. ఇక దర్శకుడు అనుదీప్ స్క్రీన్‌ప్లే, రథన్ సంగీతం ఈ మూవీకి మరో ఆకర్షణలు. మనోహర్ సినిమాటోగ్రఫీ బాగుంది. తెలంగాణ నేపథ్యంగా వచ్చిన ఈ మూవీ డైలాగుల విషయంలో గిలిగింతలు పెట్టింది.
చివరగా కథ కొత్తగా లేకపోయినా నవీన్, ప్రియదర్శి, రాహుల్ తమ నటనలతో పండించిన కామెడీ కోసం ‘జాతి రత్నాలు’సినిమాను తప్పనిసరిగా చూడొచ్చు. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు మినహాయిస్తే సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదు. ఇటీవల కామెడీ సినిమాలంటే అశ్లీలత పెరుగుతున్న నేపథ్యంలో దర్శకుడు అనుదీప్ మాత్రం క్లీన్ కామెడీగా ఈ సినిమాను మలచడం అభినందనీయం.
A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: మల్లికార్జున (కూకట్‌పల్లి)