అహ్మదాబాద్‌లోని నూతన అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో జరిగిన పింక్ బాల్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై భారత్ విజయభేరి మోగించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ అవకాశాలను భారత్ మరింత మెరుగుపరుచుకుంది. స్పిన్‌కు సహకరించిన ఈ పిచ్‌పై పర్యాటక జట్టుతో భారత స్పిన్నర్లు ఓ ఆటాడుకున్నారు. తొలి ఇన్నింగ్సులో ఇంగ్లండ్ 112 పరుగులకే ఆలౌట్ కాగా భారత్ కూడా 145 పరుగులకే కుప్పకూలింది. 33 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. ఇక రెండో ఇన్నింగ్సులో ఇంగ్లండ్ మరీ నాసిరకంగా ఆడింది. అక్షర్ పటేల్, అశ్విన్‌ల ధాటికి 81 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా ముందు 49 పరుగుల స్వల్ప విజయలక్ష్యం నిలిచింది. రోహిత్ శర్మ 25, గిల్ 15 పరుగులు చేసి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించారు.
కాగా నరేంద్ర మోదీ స్టేడియంలో పింక్ టెస్టు సందర్భంగా పలు రికార్డులు నమోదయ్యాయి. కేవలం రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న అక్షర్ పటేల్ ఈ టెస్టులో మొత్తం 11 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన ఈ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో సత్తా చాటాడు. అటు భారత తురుపు ముక్క రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో అద్భుతమైన రికార్డు సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో వేగంగా 400 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇందుకు అశ్విన్ 77 టెస్టులు తీసుకోగా.. శ్రీలంక స్పిన్నర్ మురళీధరన్ 72 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. మరోవైపు స్వదేశంలో ఎక్కువ టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ(22) రికార్డు సృష్టించాడు. ధోనీ (21) అతడి తర్వాతి స్థానంలో ఉన్నాడు.
అయితే రెండు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టు మ్యాచ్‌పై విమర్శల వర్షం కురిసే అవకాశం ఉంది. తొలిరోజు నుంచే విపరీతంగా బంతి స్పిన్ అయిన ఈ పిచ్‌పై భారత్, ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అసలే రెండో టెస్టులో పిచ్ గురించి తీవ్రంగా చర్చ జరిగిన నేపథ్యంలో ఇక అహ్మదాబాద్ టెస్టులో పిచ్ గురించి ఓ రేంజ్లో భారత్‌పై విమర్శలు రానున్నాయి.