UPPENA MOVIE REVIEW AND RATING
రేటింగ్: 3/5
ప్రేమకథల్లో స్టోరీ ఏంటంటే.. ఎవరైనా ఏం చెప్తారు? ఇద్దరు ప్రేమించుకుంటారు.. వాళ్ల పెళ్లికి ఇంట్లో వాళ్లు అడ్డం పడతారు.. మనసున్న వాళ్లయితే తర్వాత అంగీకరిస్తారు.. కొంచెం తేడా వాళ్లయితే వారిద్దరినీ చంపించేస్తారు. అనాదిగా మనం చూస్తున్న ప్రేమకథలు ఇవే బాపతు. కొద్ది కథల్లో హీరో, హీరోయిన్ తండ్రులు పరువు, మర్యాద అంటూ కన్నవాళ్లనే క్రూరంగా చంపించేస్తారు. ఈ సోదంతా ఎందుకంటే ‘ఉప్పెన’ కూడా అచ్చం ఇలాంటి ప్రేమకథే. కానీ కథనమే ఈ సినిమా గమనం.
నిరుపేద యువకుడు ఆశీర్వాదం అలియాస్ ఆశీ (వైష్ణవ్ తేజ్) బేబమ్మ అలియాస్ సంగీత(కృతి శెట్టి)ని ప్రేమిస్తాడు. బేబమ్మ ఎవరంటే ఓ గ్రామంలో ప్రాణం కంటే పరువే ఎక్కువ అనుకునే రాయుడు (విజయ్ సేతుపతి) కూతురు. ఇక చెప్పేదేముంది. వీళ్లిద్దరి ప్రేమకథకు రాయుడు అడ్డుపడతాడు. ఈ క్రమంలో బేబమ్మ, ఆశీ లేచిపోతారు. రాయుడు కంటపడకుండా వివిధ ప్రాంతాల్లో తిరుగుతారు. అనంతరం ఏమైందన్నదే మిగతా కథ.
రాయుడు పాత్రలో విజయ్ సేతుపతి అద్భుతంగా నటించాడు. అతడి ఎంట్రీతోనే కథ ఎమోషనల్ మోడ్‌లోకి వెళ్తుంది. కానీ అతడి డబ్బింగ్ బాగోలేదు. హీరో వైష్ణవ్ తేజ్‌కు ఇది డెబ్యూ సినిమానే అయినా బాగా నటించాడు. కృతి శెట్టి నటన కూడా క్యూట్‌గా ఉంది. ఆమె హావభావాలను స్పష్టంగా పలికించింది. ఆశీ, బేబమ్మ మధ్య లవ్, రొమాంటిక్ సన్నివేశాలు రొటీన్‌గా సాగుతాయి. ఫస్టాఫ్‌లో కథను మరీ లాగదీసి చెప్పారనే ఫీలింగ్ కలుగుతుంది. తొలిభాగం చూస్తే ఇంత నిడివా అనే ఫీలింగ్ కలుగుతుంది. పసలేని సన్నివేశాలే దీనికి కారణం. అయితే సినిమాలోని ఎమోషన్‌తో ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. ఇతర నటీనటులందరూ మంచి అవుట్ పుట్ ఇచ్చారు.
ఈ సినిమా సెకండాఫ్‌లో దర్శకుడి ప్రతిభ కనపడుతుంది. అయితే కొన్ని చోట్ల కథనం గతి తప్పింది. క్లైమాక్స్ ట్విస్టును ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపైనే ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంది. ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ దేవిశ్రీప్రసాద్ సంగీతం. ఈ సినిమాలోని పాటలు చాలా బాగున్నాయి. దేవి నుంచి చాన్నాళ్లకు మంచి ఆల్బమ్ వచ్చిందనే చెప్పాలి. రీరికార్డింగ్ కూడా బాగుంది. ఆర్ట్ డైరెక్టర్ పనితనం నచ్చుతుంది. సినిమాటోగ్రఫీ మరో ఆకర్షణ. అయితే ఎడిటింగ్‌లో కొన్ని సన్నివేశాలు తీసివేస్తే బాగుండేదనిపించింది. మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఇక చివరగా.. ‘ఉప్పెన’ కథ రొటీన్ అయినా కథనం కొత్తగా చెప్పేందుకు ట్రై చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా సంగీత ప్రధానమైన ఈ ప్రేమకథను ఆస్వాదించవచ్చు. దేవి నుంచి చాన్నాళ్లకు మంచి అవుట్ పుట్ వచ్చింది. అసలే ఈ మధ్య కాలంలో ప్రేమకథలు లేక అల్లాడిపోతున్న యువతీ యువకులకు ఈ సినిమా మంచి అనుభూతి ఇస్తుంది.
A REVIEW WRITTEN BY NVLR
THEATER WATHED: పీవీఆర్ ఫోరం మాల్ (స్కీన్-2)