Breaking News

‘జాంబీరెడ్డి’ మూవీ రివ్యూ

1 0

ZOMBIE REDDY MOVIE REVIEW

రేటింగ్: 2.5/5

తెలుగులో ఇప్పటివరకు పూర్తిస్థాయి జాంబీ సినిమా రాలేదు. దీంతో టెక్నికల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘జాంబీరెడ్డి’పై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ బాలనటుడు తేజ తొలిసారిగా హీరోగా మారి నటించిన చిత్రం కావడంతో ఆసక్తి పెరిగింది. అయితే ఈ సినిమా అంచనాల మేరకు లేదని స్పష్టంగా చెప్పవచ్చు. ఏదో కామెడీ చేద్దామని దర్శకుడు అల్లుకున్న స్క్రీన్‌ప్లేలో కొన్నిసార్లు లాజికల్‌గానూ మిస్ ఫైర్ అయ్యింది.

ఇక కథలోకి వెళ్తే మారియో (తేజ) గేమ్ డిజైనర్. అతడు తన మిత్రులతో కలిసి చేసిన గేమ్ తక్కువ సమయంలో పాపులర్ అవుతుంది. అయితే అందులో బగ్స్ క్లియర్ చేసుకోవడానికి కర్నూలు వెళ్లాల్సి వస్తుంది. పెళ్లి నేపథ్యంలో తన మిత్రుడికి ప్రాణహాని ఉందని గమనించిన మారియో అతడిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఇంతలో ఆ ఊరిలో అందరూ (హీరో గ్యాంగ్ తప్ప) జాంబీలుగా మారిపోతారు. అసలు జాంబీలు రావడానికి కారణమేంటనేది మిగతా కథ.

ఈ కథ కరోనా వ్యాక్సిన్‌తో మొదలవుతుంది. కానీ చివరి వరకు మళ్లీ వ్యాక్సిన్ ప్రసావనే ఉండదు. ఫస్టాప్ మొత్తం ఏదో మొక్కుబడిగా లాగించేసిన దర్శకుడు.. సెకండాఫ్‌లో జాంబీల కథను నడిపిస్తాడు. రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షనిజంతో ముడిపడ్డ సన్నివేశాలను తొలుత సీరియస్‌గా చూపించిన దర్శకుడు అనంతరం వాటిని సిల్లీగా మార్చేశాడు. కొరుకుడు సీన్‌ల మీద దృష్టి పెట్టిన దర్శకుడు కాస్త కథనం మీద ఫోకస్ చేస్తే బాగుండేదని అనిపించింది. కమర్షియల్‌గా జాంబీలను వాడుకోవడంతో అక్కడక్కడా కామెడీ పండినా మొత్తం మీద అయితే ఈ జాంబీరెడ్డి ప్రత్యేక అనుభూతి అయితే ఇవ్వదు.

నటీనటుల్లో తేజ చాలా ఈజ్‌గా నటించాడు. మారియో పాత్రకు అతడు సూటయ్యాడు. హీరోయిన్ ఆనంది పాత్ర పరంగా మంచిగా నటించింది. మరో హీరోయిన్ దక్ష మాత్రం గ్లామర్‌ పరంగా మాత్రమే ఆకట్టుకుంది. ఉన్నంతలో గెటప్ శీను పాత్ర బాగుంది. సాంకేతికంగా ఈ సినిమాను ప్రశాంత్ వర్మ బాగానే తీర్చిదిద్దినా కథ, కథనాల పరంగా మరింత పకడ్బందీగా స్క్రిప్ట్ రాసుకుంటే బాగుండేది. జాంబీ జోనర్‌గా సినిమాను సిల్లీగా కాకుండా సీరియస్‌గా తీస్తే ఫలితం కనిపించేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మార్క్. కె.రాబిన్ నేపథ్య సంగీతం లౌడ్‌గా అనిపించినా సినిమా మూడ్‌ను నిలబెట్టింది.

ఓవరాల్‌గా కాస్త కామెడీ కోసం అయితే జాంబీరెడ్డిని చూడవచ్చు. కానీ అప్పుడెప్పుడో అరిగిపోయిన ఫ్యాక్షనిజం గురించి మళ్లీ ఈ సినిమాలో చర్చించడం మూసగా అనిపించింది. ఏదో కొత్తదనం, అనుభూతి ఇస్తుందని ఆశించిన ఈ మూవీ నిరాశపరిచింది. ఈ మూవీ పూర్తయ్యాక థియేటర్‌లో సీట్ల మధ్యలోంచి నడుచుకుంటూ వస్తుంటే ప్రేక్షకులు కూడా జాంబీల్లాగానే కనిపించారంటే ఈ మూవీ ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి.

A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: భ్రమరాంబ (కూకట్‌పల్లి)