నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఉద్యమం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు తెర తీసింది. రైతుల ఉద్యమాన్ని సమర్థిస్తూ పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలు గత రెండు రోజులుగా ట్వీట్ చేశారు. కానీ మన బాలీవుడ్, క్రికెట్ సెలబ్రిటీలు మాత్రం కేంద్రానికి మద్దతు పలికారు. అయితే రైతుల కష్టాలపై ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్న వీరి వైఖరిని తప్పుబడుతూ భారత్‌కు చెందిన వేరే సెలబ్రిటీలు ట్వీట్లు చేశారు.
ఢిల్లీలో రైతుల నిరసన ప్రాంతాల వద్ద ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై అంతర్జాతీయ పాప్ గాయని రిహానా, ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ భారత ప్రభుత్వంపై మండిపడ్డారు. అటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేనకోడలు, న్యాయవాది మీనా హ్యారిస్ కూడా ‘భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది’ అంటూ ట్వీట్ చేశారు. అటు రైతుల నిరసనలపై భారత్‌కు చెందిన ప్రముఖులు ఎందుకు మాట్లాడటంలేదని హాలీవుడ్ నటి, వ్లాగర్ అమండా సెర్నీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రైతు ఉద్యమాన్ని అణిచివేయడానికి ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారని మాజీ శృంగార తార మియా ఖలీఫా వ్యాఖ్యానించారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. వరుసబెట్టి అంతర్జాతీయ స్టార్లు రైతుల ఉద్యమానికి మద్దతు పలికితే మన బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, కరణ్ జోహార్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, గాయని లతా మంగేష్కర్ మాత్రం అంతర్జాతీయ సెలబ్రిటీలపై మండిపడుతూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలికారు. విదేశీ వ్యక్తులు భారత దేశ వ్యవహారాల్లో తలదూర్చడమేంటి అని ప్రశ్నించారు. కంగనా రనౌత్ అయితే ఏకంగా రైతులను ఉగ్రవాదులతో పోల్చింది. ఇవన్నీ గమనిస్తే లోపం ఎవరిది అన్న ప్రశ్న సామాన్యుడిని వెంటాడుతోంది. ఇన్నాళ్లూ రైతుల ఉద్యమంపై మాట్లాడని మన సెలబ్రిటీలు అంతర్జాతీయ సెలబ్రిటీలు స్పందించగానే ఎందుకు ప్రతిస్పందించాల్సిన అవసరం వచ్చింది? కేంద్రానికి మద్దతుగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనే అంశాలపై విశ్లేషించాల్సి ఉంటుంది. స్వార్థం కోసమే వారు ఇలా చేశారని, రైతులు చాలారోజుల నుంచి ఉద్యమం చేస్తున్నా పట్టించుకోని దద్దమ్మలు ఇప్పుడు స్పందించారంటే వారికి స్వార్థ ప్రయోజనాలు, లబ్ధి చేకూరడమే ప్రధాన అజెండా అని ప్రజలు మండిపడుతున్నారు. గతంలో రైతు సమస్యలపై స్పందించి.. ఇప్పుడు దేశం తరఫున మాట్లాడి ఉంటే వారి హోదా, పరువు కాస్త అయినా నిలబడేవి అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. నిజమైన రాజులు (రైతులు) నిరసనల్లో ఉన్నారని, అక్షయ్ అబద్ధపు రాజు అని భారతీయ గాయకుడు జాజీ బీ ఆరోపించారు.