Breaking News

ప్రదీప్ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’మూవీ రివ్యూ

1 0

ANCHOR PRADEEP 30 ROJULLO PREMINCHADAM ELA MOVIE REVIEW

రేటింగ్: 2.25/5

ప్రదీప్ బుల్లితెరపై యాంకర్‌గా చేస్తూ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించాడు. అయితే అతడికి హీరో అవ్వాలనే కోరిక ఉండటంతో ఎట్టకేలకు ఓ సినిమా చేశాడు. అదే ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. ఈ సినిమా కథ విని తాను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కథ అని ప్రదీప్ కలరింగ్ ఇచ్చాడు. అయితే ఈ కథలో అంత ఏం నచ్చిందో ప్రదీప్‌కే తెలియాలి.

ఇక కథలోకి వెళ్తే అర్జున్ (ప్రదీప్), అక్షర (అమృతా అయ్యర్) ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుతూ చీటికి మాటికి పోట్లాడుకుంటారు. ఓ టూర్‌లో వీరిద్దరూ ఒకరి శరీరంలోకి ఒకరు మారిపోతారు. గత జన్మ ప్రభావంతోనే వీరు మారిపోతారు. అయితే గత జన్మలో వీరిద్దరికీ ఏమైంది, మళ్లీ ఈ జన్మలో వీరు కలుసుకుంటారా లేదా అన్న విషయం మిగతా కథ.

అప్పుడెప్పుడో వచ్చిన ‘ఆనందం’ సినిమాలో హీరో, హీరోయిన్లు కొట్టుకున్న మాదిరిగా ఈ మూవీలో ప్రదీప్, అమృత ఎప్పుడూ తిట్టుకుంటూ ఉంటారు. అయితే దర్శకుడు మున్నా ఇక్కడితో ఆగకుండా హాలీవుడ్ మూవీ కాన్సెప్టును ఈ కథలో కలగాపులగం చేశాడు. ఫస్టాఫ్‌లో సిల్లీ జోకులతో నడిచే కాలేజీ సన్నివేశాలు చికాకు పుట్టిస్తాయి. కొన్ని చోట్ల అయితే డ్రామా శ్రుతిమించినట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ అక్కడక్కడా సరదాగా అనిపించినా సెకండాఫ్‌లో రొటీన్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు విసిగించాడు. ఒక ప్రేమకథ చూస్తున్నామని ఈ సినిమాలో ఏ కోశాన ఫీలింగ్ రాకపోవడం ప్రధాన లోపంగా మారింది.

ఈ సినిమాలోనే బెస్ట్ సాంగ్ ‘నీలి నీలి ఆకాశం’ పాట మొదట్లోనే వస్తుంది. దీంతో సినిమాపై హైప్ పెరుగుతుంది. కానీ ఫ్లాష్ బ్యాక్ తర్వాత వర్తమానంలోకి వచ్చేసరికి సినిమా కథ కూడా దారి తప్పుతుంది. ఇంటర్వెల్ సీన్ మినహాయిస్తే సినిమా అంతా గోలగోలగా ఉంటుంది. ‘ఆనందం’లో మాదిరిగా కామెడీ, ఎమోషన్ ఇందులో వర్కవుట్ కాలేదు. ప్రదీప్ బాగానే నటించినా దర్శకుడు అతడిని సరిగ్గా వాడుకోలేదు. అనూప్ రూబెన్స్ ఒక్కడే ఈ సినిమాకు సిన్సియర్‌గా పనిచేశాడని అనిపిస్తుంది.

చివరగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ రొటీన్ కథ, కథనాలతో బోర్ కొట్టిస్తుంది. మధ్య మధ్యలో కొన్ని ట్విస్టులు ఆసక్తి రేపినా కథనం ప్రేక్షకుడి ఊహలకు తగ్గట్లుగా సాగడంతో సినిమాపై ఆసక్తి ఉండదు. ఒకటి, రెండు పాటల మినహా ఈ మూవీలో చెప్పుకోదగ్గ అంశాలేవీ లేవు. హీరోగా ఎదగాలంటే ప్రదీప్ మరో సినిమా వరకు వేచి చూడాల్సిందే.

A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: మల్లికార్జున (కూకట్‌పల్లి)