టాలీవుడ్లో గత ఏడాది కరోనా కారణంగా ఎన్నో సినిమాల విడుదలలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లాక్డౌన్ విరామం అనంతరం డిసెంబరులో మళ్లీ థియేటర్లు తెరుచుకోగా సినిమాలు వరుసగా ప్రేక్షకులపై దండయాత్ర చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద, చిన్న సినిమాలు తమ రిలీజ్ డేట్లను వరుసపెట్టి ప్రకటించేస్తున్నాయి. ఇప్పటికే ‘RRR’, పుష్ప, సిటీ మార్, గని, F3, లవ్‌స్టోరీ, విరాట పర్వం, అరణ్య, రంగ్ దే వంటి చిత్రాలు తమ విడుదల తేదీలను ప్రకటించగా.. తాజాగా విక్టరీ వెంకటేష్ నారప్ప, మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలు కూడా తమ రిలీజ్ డేట్లను ప్రకటించేశాయి. నారప్ప చిత్రం ఈ ఏడాది మే 14న విడుదల కానుండగా సూపర్ స్టార్ మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో 2020 సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’తో అలరించిన ప్రిన్స్ మళ్లీ 2022 సంక్రాంతికే అభిమానులను పలకరిస్తాడని తేలిపోయింది.
