Breaking News

స్పెషల్ రివ్యూ: మణిశర్మకు ‘చావో రేవో’

1 0

తెలుగు సినిమా పాటలలో మణిశర్మకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. 1992లో రామ్‌గోపాల్ వర్మ ‘రాత్రి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై విక్టరీ వెంకటేష్ ‘ప్రేమించుకుందాం..రా’ సినిమాతో పాపులర్ అయిన అతడు మెలోడి బ్రహ్మగా సంగీత ప్రియుల మదిలో స్థానం సంపాదించాడు. ఒక దశలో పెద్ద హీరో సినిమా చేస్తున్నాడంటే ఆ మూవీకి ‘మణిశర్మ’ ఒక్కడే ఆప్షన్ అయ్యేవాడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా ప్రతి స్టార్‌కు అతడు సంగీతం అందించాడు.

మహేష్‌బాబు వరుస సినిమాలకు అతడు సంగీతం సమకూర్చి ఎన్నో హిట్ పాటలను అందించాడు. రాజకుమారుడు, వంశీ, మురారి, ఒక్కడు, అతడు, అర్జున్ పోకిరి వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు సూపర్ డూపర్ హిట్ పాటలను మణిశర్మ అందించాడు. అయితే ‘ఖలేజా’ సినిమా తర్వాత మహేష్ దాదాపు 7-8 సినిమాలు చేసినా మణిశర్మను మాత్రం తీసుకోలేదు. అటు పవన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ‘ఖుషి’కి సంగీతం అందించింది మణిశర్మే. ఓ వైపు దేవిశ్రీప్రసాద్, మిక్కీ జే మేయర్, తమన్ వంటి సంగీత దర్శకుల రాకతో తనకు అవకాశాలు తగ్గిపోయినా మెలోడి బ్రహ్మ వెనక్కి తగ్గలేదు. రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. రామ్‌తో వరుసగా ‘రెడ్’ మూవీకి అవకాశం కొట్టేశాడు.

రాజమౌళికి కీరవాణి, సుకుమార్‌, కొరటాల శివ వంటి దర్శకులకు దేవిశ్రీప్రసాద్ ఆస్థాన సంగీత దర్శకులుగా కొనసాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓటమి ఎరుగని దర్శకుల్లో రాజమౌళి తర్వాత స్థానంలో ఉన్న కొరటాల శివ (మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను) తొలిసారిగా తన కెరీర్‌లో దేవిశ్రీప్రసాద్‌ను పక్కనపెట్టి చిరంజీవి ‘ఆచార్య’ కోసం మణిశర్మకు అవకాశం ఇచ్చాడు. ఒకరకంగా చెప్పాలంటే మణిశర్మకు ఈ ఛాన్స్ చావోరేవో లాంటిది. ఓ వైపు తమన్ తన కెరీర్ అత్యుత్తమ ఫామ్‌తో స్టార్ హీరోల సినిమాలను దక్కించుకుంటున్న వేళ మణిశర్మ ‘ఆచార్య’తో సత్తా చాటి మళ్లీ సంగీత ప్రియులకు మెలోడి పాటల రుచిని చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.