Breaking News

‘1000 వాలా’ మూవీ రివ్యూ

0 0

ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో ఆసక్తి రేపిన చిన్న బడ్జెట్ మూవీ ‘1000 వాలా’. యువ కథానాయకుడు అమిత్ హీరోగా సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ ఈ సినిమాను నిర్మించాడు. ప్రముఖ సీనియర్ నటులు సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషించారు. మార్చి 14న విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం.

కథ: హీరో అర్జున్ (అమిత్) చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతాడు. దీంతో తాతయ్య దగ్గరే పెరుగుతాడు. సినిమాల్లోకి వెళ్లాలనేది అతడి కల. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కోరిక తీరదు. ఆ సమయంలో అతడి స్నేహితుడి తండ్రి అండగా నిలుస్తాడు. అర్జున్‌ను మంచి నటుడిని చేయమని తన స్నేహితుడిని కోరతాడు. దీంతో అర్జున్ హైదరాబాద్ వెళ్లి అక్కడ భవానీ ప్రసాద్ (ముక్తార్ ఖాన్)ను కలుస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ శైలుతో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అర్జున్‌ను లవ్ చేస్తుంది. అయితే తన లవ్ ప్రపోజ్ చేద్దామనుకున్న టైంలో ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. చనిపోయిన అమిత్ ప్లేస్‌లో తనను తెచ్చి షూటింగ్ చేస్తున్నారని అర్జున్‌ తెలుసుకుంటాడు. మరోవైపు కావ్య అనే అమ్మాయిని చంపేందుకు డేవిడ్ (షారుఖ్ భైగ్) ప్రయత్నిస్తాడు. ఆమెను అర్జున్ కాపాడతాడు. కానీ అమిత్‌ను తానే చంపానని కావ్య చెప్పడంతో కంగుతింటాడు. అసలు కావ్య అమిత్‌ను ఎందుకు చంపింది.. అర్జున్ జీవితం ఏ తీరాలకు చేరిందన్నది మిగతా కథ.

విశ్లేషణ: టాలీవుడ్‌లో కమర్షియల్ కథలు కొత్తేమీ కాదు. ఏడాదికి పదుల సంఖ్యలో కమర్షియల్ సినిమాలు విడుదలవుతుంటాయి. అయితే కమర్షియల్ సినిమాలకు ఫ్యామిలీ సెంటిమెంట్ తోడైతే విజయం పక్కాగా వరిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు అఫ్జల్ షేక్ ఈ సినిమాను తెరకెక్కించాడు. టైటిల్ నుంచే కమర్షియల్‌గా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాను తీర్చిదిద్దాడు. తాత మనవళ్ల సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్, మదర్ సెంటిమెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కథ, కథనాలు ప్రేక్షకులకు ఎంగేజింగ్‌గా ఉండేలా చూసుకుని విజయం సాధించాడు.

నటీనటుల విషయానికి వస్తే అమిత్ డ్రీమ్‌స్టార్ అర్జున్, అమిత్ పాత్రల్లో ఒదిగిపోయి నటించాడు. హీరోయిన్ గ్లామరస్‌గా ఆకట్టుకుంటుంది. విలన్‌గా షారుఖ్ భైగ్ స్టైలిష్‌గా ఉన్నాడు. హీరోకు ధీటుగా కనిపించి ఆకట్టుకున్నాడు. సీనియర్లు సుమన్, ముక్తార్ ఖాన్, పిల్ల ప్రసాద్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతిక విభాగం విషయానికి వస్తే వంశీకాంత్ రేఖాన అందించిన సంగీతం మేజర్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. బీజీఎంతో పాటు పాటలు కూడా అలరిస్తాయి. ముఖ్యంగా చివరి మాట మాస్ ఆడియన్స్‌తో స్టెప్పులు వేయిస్తుంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. చందు ఏజే సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. పల్లెటూరి లొకేషన్స్ అందంగా కనిపిస్తాయి. నిర్మాణ విలువలు కూడా ఆకట్టుకుంటాయి.

ఈ సినిమాలో హీరో నటన, డైరెక్షన్, మ్యూజిక్, ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ప్లస్ పాయింట్లు కాగా.. సెకండాఫ్‌లో ల్యాగ్ ఉండటం, నెమ్మదించిన కథనం మైనస్ పాయింట్లుగా చెప్పవచ్చు. మొత్తంగా ‘1000 వాలా’ మూవీ ఇటు మాస్‌తో పాటు అటు ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ వీకెండ్‌లో థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలంటే ఈ మూవీ మంచి ఛాయిస్.

రేటింగ్ : 3/5