Breaking News

సినిమాల కొరత.. థియేటర్లు మూత.. తప్పిదం ఎవరిది?

1 0

టాలీవుడ్‌లో ఈ ఏడాది విచిత్రమైన పరిస్థితి నెలకొంది. సమ్మర్‌లో పెద్ద సినిమాలు ఒక్కటి కూడా విడుదల కాలేదు. దీంతో ఆక్యుపెన్సీ లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. చిన్న సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల వైపు రావడం లేదు. దీంతో సరైన సినిమాలు లేకపోవడం, ఉన్న సినిమాలకు ప్రేక్షకులు రాకపోవడంతో తెలంగాణ థియేటర్స్ యాజమాన్యం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ శుక్రవారం నుండి పది రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూత పడనున్నాయి. థియేటర్లు నడపడానికి భారం కావడంతో యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

థియేటర్లు మూతపడేందుకు కారణం పెద్ద సినిమాలు లేకపోవడంతో పాటు ఐపీఎల్‌, ఎలెక్ష‌న్స్ కూడా పరోక్షంగా కారణమయ్యాయి. దీంతో థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య భారీగా త‌గ్గింది. సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల రెవెన్యూ చాలా త‌గ్గిపోయింది. నిర్వ‌హ‌ణ వ్య‌యాలు కూడా రావ‌డం క‌ష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ పూర్త‌య్యి ప‌రిస్థితులు మొత్తం సాధార‌ణ స్థితి చేరుకునే వ‌ర‌కు ప‌ది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌ను మూసివేయాల‌ని తెలంగాణ థియేట‌ర్స్ ఓన‌ర్స్ అసోసియేష‌న్ నిర్ణ‌యించింది. అయితే ప్రతి సమ్మర్‌లో కనీసం రెండు పెద్ద సినిమాలు విడుదలయ్యేవి. ఈ ఏడాది మాత్రం ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా స్టార్ హీరో సినిమా వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు. ఈ వేస‌విలో రిలీజ్ కావాల్సిన ఎన్టీఆర్ దేవ‌ర‌, ప్ర‌భాస్ క‌ల్కి అనివార్య కారణాల వల్ల వాయిదా ప‌డ్డాయి. ప‌లు చిన్న సినిమాలు విడుద‌లైనా ఏది హిట్టు అందుకోలేదు. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్వహణ యజమానులకు భారంగా మారింది. ఈ పరిస్థితికి సినిమా ఇండస్ట్రీ ప్లానింగ్ లోపమే కారణమని అభిమానులు మండిపడుతున్నారు.