ఆదిపురుష్: దైవత్వం కనిపించని రామాయణం
రేటింగ్: 2.5/5
భారతీయుల పురాణ ఇతిహాసాలలో రామాయణం చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. అందుకే దీనిని ఎంతమంది సినిమాగా తీసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అందులోనూ ప్రభాస్ లాంటి స్టార్ హీరో తీస్తున్నాడనేసరికి అందరిలోనూ ఆసక్తి కలిగింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఎలా తీస్తాడో అని చాలా మంది ఎదురుచూశారు. మరి ఓం రౌత్ ఆదిపురుష్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
మాములుగా రామాయణం అంటే సీతారాముల కళ్యాణం నుంచి ప్రారంభం అవుతుంది. కానీ ఆదిపురుష్ సినిమా మాత్రం సీతారాముల వనవాసం నుంచి స్టార్ట్ అవుతుంది. సూర్పణక రాముడిపై మోహం పెంచుకోవడం, రాముడు తిరస్కరించడం, సూర్పణక అన్న రావణుడు పగతో రగిలిపోవడం, సీతను కిడ్నాప్ చేయడం, లంకపై రాముడు దండెత్తడం వంటి అంశాలతో ఆదిపురుష్ తెరకెక్కింది.
ఏ కాలంలో మనం రామాయణం చూసినా రాముడికి మీసం ఉండదు. అలాగే సీత అంటే ఎంతో ముచ్చటగా కనిపిస్తుంది. రావణుడు విలన్ అయినా భయంకరంగా అయితే కనిపించడు. కానీ ఆదిపురుష్‌లో ఓం రౌత్ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని రాముడికి మీసం పెట్టేశాడు. రావణుడు అంటే అతడో ఏలియన్ లాగా చూపించాడు. టెక్నాలజీని ఇష్టం వచ్చినట్లు వాడుకోవడంతో ఈ సినిమాలో ఏ కోశాన దైవత్వం కనిపించదు. పైగా అసహజంగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ ఓకే అనిపించినా.. సెకండాఫ్‌లో లంకలో సాగే యుద్ధ సన్నివేశాలు కార్టూన్ సినిమా మాదిరిగా అనిపిస్తాయి.
రాముడిగా ప్రభాస్ లుక్ బాగోలేదు. అయితే తన పరిధిలో ప్రభాస్ చేయగలిగింది చేశాడు. సినిమా ప్రారంభమైన చాలాసేపటికి రాముడిగా ప్రభాస్ ఓకే అనిపిస్తాడు. కానీ రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాకు పెద్ద మైనస్. రావణుడి పాత్రలో అతడి లుక్స్ ఆకట్టుకోవు. సీతగా కృతిసనన్ నటన కూడా అంతంత మాత్రమే. ఆంజనేయుడిగా దేవదత్త, లక్ష్మణుడిగా సన్నీసింగ్ సరిపోయారు. దర్శకుడు తేలిపోయినా టెక్నికల్‌గా ఆదిపురుష్ ఫర్వాలేదనిపిస్తుంది. సంగీతం ఈ మూవీకి ప్లస్ పాయింట్. అజయ్ అతుల్ బీజీఎం ఆకట్టుకుంటుంది. కొన్ని చోట్ల విజువల్స్ బాగున్నా.. మరికొన్ని చోట్ల అసహజంగా అనిపిస్తాయి.
మొత్తానికి ఓం రౌత్ తీసిన రామయణ గాథ ఆదిపురుష్ అంతంత మాత్రంగానే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను రిసీవ్ చేసుకునే అంశంపైనే ఈ మూవీ సక్సెస్ ఆధారపడి ఉంది. ఇప్పటివరకు రాముడిగా ఎన్టీఆర్, శోభన్ బాబు, బాలకృష్ణ, సుమన్ లాంటి నటులు తెలుగు ప్రేక్షకులను అలరించారు. కానీ ప్రభాస్ వాళ్ల స్థాయిని మాత్రం అందుకోలేదు. ఓం రౌత్ తీసిన ఆదిపురుష్‌ను చూస్తే దైవత్వం కొంచెం కూడా కలగదు. మోడ్రన్ రామాయణం అని సర్దుకుపోయినా ఈ ఆదిపురుష్ ఎమోషనల్‌గా అయితే కనెక్ట్ కావడం కష్టమే.
A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: జేపీ సినిమాస్- చందానగర్