ఎవరన్నారు టెస్ట్ క్రికెట్ చచ్చిపోయిందని.. ఎవరన్నారు టెస్ట్ క్రికెట్లో మజా ఉండటం లేదని.. అసలు టీ20 క్రికెట్ వచ్చాక టెస్ట్ క్రికెట్ ఆదరణ కోల్పోయిందనే మాట అవాస్తవం అని తాజాగా ఓ మ్యాచ్ నిరూపించింది. ఇంగ్లండ్‌పై ఒక్క పరుగు తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించి టెస్ట్ క్రికెట్ సత్తాను మరోసారి నిరూపించింది. తొలి ఇన్నింగ్స్‌లో 435 పరుగుల భారీ స్కోరు చేసి డిక్లేర్ చేసిన ఇంగ్లండ్.. చివరకు మాత్రం మ్యాచ్ గెలవకలేకపోయింది. వెల్లింగ్టన్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్ట్ అభిమానులకు కావాల్సినంత మజాను ఇచ్చింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 435 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ టీమ్ కేవలం 209 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆ జట్టును ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఫాలో ఆన్ ఆడించాడు. అయితే అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ అంచనాలకు మించి రాణించింది. కెప్టెన్ విలియమ్సన్ (132) సెంచరీకి తోడు బ్లండెల్ (90), మిచెల్ (54) పరుగులు చేశారు. దీంతో ఇంగ్లండ్ ముందు 258 పరుగుల టార్గెట్ నిలిచింది. అయితే ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో తేలిపోయింది. రూట్ (95) ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. అద్భుత ఫామ్‌లో ఉన్న హ్యారీ బ్రూక్ రనౌట్ కావడం ఇంగ్లండ్ విజయావకాశాలను దెబ్బతీసింది. ఆ జట్టు చివరకు 256 పరుగులకు ఆలౌట్ అయింది. ఒకే ఒక్క పరుగు తేడాతో కివీస్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.