Breaking News

వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ మూవీ రివ్యూ

1 0

VAISHNAVTEJ KONDAPOLAM MOVIE REVIEW AND RATING

రేటింగ్: 3/5

కొండపొలం అనే నవల ఆధారంగా తెరకెక్కిన సినిమానే కొండపొలం. పవన్ హీరోగా ఓ వైపు హరిహర వీరమల్లు లాంటి మూవీని తెరకెక్కిస్తూనే మధ్యలో ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కించాడు. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్ నటనను కనపరిచాడు. ప్రకృతి విలువను ఈ సినిమాలో దర్శకుడు చాలా చక్కగా చాటి చెప్పాడు. వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

కథలోకి వెళ్తే.. రాయలసీమ ప్రాంతంలోని ఓ అటవీ ప్రాంతానికి చెందిన రవీంద్ర యాదవ్ (వైష్ణవ్ తేజ్) బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తాడు. కానీ అవి విఫలం అవుతాయి. చివరకు ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగానికి వెళ్లిన అతడు తన జీవిత పాఠాలను అక్కడి అధికారులకు వివరిస్తాడు. ఉద్యోగం దొరక్క నగరంలో బతకలేని స్థితిలో కరవు కాలంలో తన తండ్రి(సాయిచంద్)తో కలిసి గొర్రెల మందకు మేత కోసం కొండపొలానికి వెళ్లిన రోజులను గుర్తు చేసుకుంటాడు. కొండపొలంలో అతడు నెలరోజుల పాటు గడపాల్సి వస్తుంది. దీంతో రవీంద్రకు కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ఆ పరిస్థితుల నుంచి రవీంద్ర ఎలా బయటపడ్డాడు? తన కథలో ఓబులమ్మ(రకుల్‌ప్రీత్ సింగ్) పాత్ర ఏమిటన్నదే మిగతా కథ.

ముందుగా నవల ఆధారంగా ఎంతో సహజంగా ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు క్రిష్‌ను అభినందించి తీరాల్సిందే. చక్కటి కథను మంచిగా ప్రజెంట్ చేశాడు. అయితే స్క్రీన్‌ప్లే నెమ్మదిగా సాగడం కొందరికి నచ్చకపోవచ్చు. కానీ ఈ సినిమా అందాన్ని అనుభవించి తీరాలంటే ఆ మాత్రం కథనం తప్పనిసరి అని మనం గుర్తించాలి. కానీ క్రిష్ తీసిన గమ్యం, వేదం, కంచె లాంటి చిత్రాల్లో మాదిరి ప్రేక్షకులను కదిలించే బలమైన ఎమోషన్ లేకపోవడం కొండపొలం సినిమాకు మైనస్. మరోవైపు రాయలసీమ అంటే మనం ఇంతవరకు ఫ్యాక్షన్ సినిమాలు ఎక్కువ చూశాం. అక్కడి వ్యక్తులు తమ పశువులకు ఏమైనా జరిగితే.. ప్రాణాలను పణంగా పెట్టి పోరాడతారని క్రిష్ ఈ సినిమా ద్వారా తెలియజేశాడు. అయితే నవలను ఎక్కువగా ప్రేమించడం వల్లనేమో సినిమా కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే వైష్ణవ్ తేజ్ ఎంతో బాగా నటించాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో కళ్లతో హావభావాలు పలికించిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే వైష్ణవ్ తేజ్‌కు ఈ కాన్ఫిడెన్స్ ఉప్పెన సినిమా నుంచి వచ్చిందనుకుంటే పొరపాటే. ఉప్పెన సినిమా విడుదల కంటే ముందే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీతో వైష్ణవ్ తేజ్ మరో మెట్టు ఎక్కాడని చెప్పవచ్చు. ఓబులమ్మ పాత్రలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్‌కు కూడా ఇది కొత్త తరహా అనుభవమే. ఇప్పటివరకు రకుల్ చేసిన పాత్రల్లో మెజారిటీ గ్లామరస్ రోల్సే. అయితే ఇటువంటి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కూడా తను చేయగలనని రకుల్ ఈ సినిమాతో నిరూపించింది. సాయిచంద్, కోట శ్రీనివాసరావు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముఖ్యంగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. పాటలన్నీ కథలో భాగంగానే నడుస్తాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో డైలాగ్‌లు కూడా చాలా అర్థవంతంగా ఉన్నాయి. రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి కథకుడిగానే కాక మాటల రచయితగానూ మెప్పించాడు. ఇక్కడ జ్ఞానశేఖర్ కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తన విజువల్స్‌తో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడు. పోరాట సన్నివేశాలు, అడవిలో వచ్చే సీక్వెన్సులు అయితే కనులవిందు అని చెప్పవచ్చు.

ఓవరాల్‌గా చూస్తే… కొండపొలం ఫస్టాఫ్ కథ వేగంగా ఉన్నా.. సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే కాస్త స్లో అవ్వడంతో సినిమా నెమ్మదించిన భావన కలుగుతుంది. కమర్షియల్‌గా ఈ సినిమా రేంజ్ ఇప్పుడే అంచనా వేయలేం కానీ.. మంచి సినిమాను చూసిన అనుభూతి కలుగుతుంది. మంచి సినిమాలు రావాలని కోరుకోవడం కాదు.. వచ్చినప్పుడు వాటిని ఆదరించి కూడా మనం చూపించాలి. కొండపొలం మూవీ ఓ మంచి సినిమా. ఈ సినిమా ఓ చక్కటి ఫీల్‌ను అందిస్తుందనే విషయంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: భ్రమరాంబ (కూకట్ పల్లి)