Breaking News

సాయిధరమ్‌తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ రివ్యూ

1 0

రేటింగ్: 2.5/5

SAIDHARAMTEJ REPUBLIC MOVIE REVIEW AND RATING

టాలీవుడ్‌లో లవ్‌స్టోరీ సినిమా తర్వాత అందరిలో ఆసక్తి రేకేత్తించిన చిత్రం రిపబ్లిక్. ఈ సినిమాకు దేవ్‌కట్టా దర్శకుడు కావడం, రమ్యకృష్ణ లాంటి సీనియర్ హీరోయిన్ నటించడం, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ కావడం వల్ల ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా మాములు సినిమాగానే నిలిచిపోయిందని చెప్పాలి. ప్రస్థానం లాంటి మూవీ తరహాలో ఈ సినిమా సాగుతుందని ఆశించిన అభిమానులకు నిరాశ కలుగుతుంది. దేవ్‌కట్టా ఒక సీరియస్ సబ్జెక్టు తీసుకుని దానిని ఎలా ముగించాలో తెలియక తడబడినట్లు ఈ మూవీలో స్పష్టంగా కనిపించింది.

కథలోకి వెళ్తే.. పంజా అభిరామ్ (సాయిధరమ్ తేజ్) చిన్నప్పటి నుంచే తెలివైనవాడు. అమెరికాలోని ఎంఐటీలో సీటు వచ్చినా వెళ్లకుండా వ్యవస్థను మార్చాలనే ఉద్దేశంతో ఐఏఎస్‌కు ప్రిపేరవుతుంటాడు. అయితే తన కొడుకు ఈ వ్యవస్థలో ఉండటం అభిరామ్ తండి దశరథ్ (జగపతిబాబు)కు నచ్చదు. కానీ అభిరామ్ తను ఉంటున్న జిల్లాకే కలెక్టర్ అవుతాడు. కానీ ఆ ప్రాంతంలో విశాఖ వాణి (రమ్యకృష్ణ) పార్టీ అధికారంలోకి రావడంతో అవినీతి, అక్రమాలు జరుగుతూ ఉంటాయి. దీంతో ఆమెపై అభిరామ్ పోరాటానికి సిద్ధమవుతాడు. మరి ఈ పోరాటంలో అతడు నెగ్గుతాడా? లేదా? అన్నదే మిగతా స్టోరీ.

ఈ సినిమాలో హార్డ్ హిట్టింగ్ డ్రామా ఉంటుంది. దానిని ఎక్కడా డైల్యూట్ చేయకుండా దర్శకుడు దేవ్‌కట్టా తెరకెక్కించాడు. దీంతో ఫస్టాఫ్ బాగుందనే ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో డైలాగులు ఆలోచింపచేసేలా ఉన్నాయి. సాయిధరమ్ తేజ్ తన కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పాలి. డ్యాన్స్, ఫైట్స్, కామెడీ టైమింగ్ వంటి తన బలాలను వదిలేసి అతడు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన సినిమా ఇది. సెకండాఫ్‌లో రమ్యకృష్ణతో సాయిధరమ్ తేజ్ సీన్లు చాలా బాగా వచ్చాయి. మరోవైపు ఐశ్వర్య రాజేష్ తన అన్న ఆచూకీ కోసం వెతికే మైరా హాన్సన్ పాత్రలో కనిపిస్తుంది. అయితే ఆమెది చెప్పుకోదగ్గ పాత్రేమీ కాదు. జగపతిబాబు ఎప్పుడూ చేసే పాత్రలకు భిన్నంగా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ చేసి దానికి న్యాయం చేశాడు.

ఈ సినిమాకు ప్లస్ పాయింట్, మైనస్ పాయింట్ దర్శకుడు దేవ్‌కట్టానే. ఎందుకంటే ఫస్టాఫ్‌లో ఆసక్తికర సన్నివేశాలతో ఆకట్టుకుని సెకండాఫ్‌లో లాజిక్‌లు లేకుండా క్లైమాక్స్ నడిపించిన తీరు ఊసురుమనిపిస్తుంది. రెండు వేర్వేరు ఐడియాలజీలతో ఏర్పడిన పార్టీల మధ్య ఏర్పడిన పొత్తుని శోభనంతో వర్ణించడం వంటి హార్డ్ హిట్టింగ్ సన్నివేశాలు, సీన్లు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ తరహా ముగింపు జనాలకు రుచించదు. అయినా పొలిటికల్ బ్యాక్‌బ్రాప్ మూవీ అన్న తర్వాత కమర్షియల్ అంశాలు ఉండాలి. ఈ మూవీలో అది మిస్ అయ్యింది. ఈ సినిమాలో సంగీతం కూడా మైనస్‌గా మారింది. మణిశర్మ పాటలు వినసొంపుగా లేవు. బీజీఎం కూడా అంతంతమాత్రంగానే ఉంది. కొన్ని అనవసర సన్నివేశాలు ఉన్నాయి. వాటిని ఎడిటింగ్‌లో తీసేస్తే సరిపోయేది. సినిమాటోగ్రఫీ కూడా సోసోగానే ఉంది.

చివరగా.. మంచి పాయింట్ ఎంచుకున్న దర్శకుడు దానిని డీలింగ్ చేయడంలో తడబడ్డాడు. సెకండాఫ్‌ను మరో రకంగా చెప్పాల్సింది. కథనం గ్రిప్పింగ్‌గా ఉంటే ఈ సినిమా ఫలితం మరోలా ఉండేది. స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు మైనస్. అయితే పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ ఇష్టపడేవారు ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. కొన్ని సన్నివేశాల్లో జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా కల్ట్ సినిమా స్టేటస్‌కు వెళ్లేది. ప్రధానంగా సినిమా క్లైమ్యాక్స్‌ను ప్రేక్షకులు ఎలా తీసుకుంటారు అనే అంశం మీదనే ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంది.

A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: మల్లికార్జున (కూకట్‌పల్లి)