ఏపీలో జగన్, తమిళనాడులో స్టాలిన్ అత్యధిక మెజారిటీలతో ప్రభుత్వాలను ఏర్పరిచారు. ఇంకా చెప్పాలంటే స్టాలిన్ కంటే జగన్‌ను ప్రజలు అత్యధికంగా విశ్వసించారు. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో స్టాలిన్ కంటే జగన్ వెనుకబడే ఉన్నారని చెప్పాలి. రాజకీయంగా వైసీపీ అధినేత ఎలా ప్రవర్తిస్తున్నా.. ప్రజలకు అవసరమైన నిర్ణయాలకు సంబంధించి ఆయన కొంచెం స్టాలిన్ కంటే తక్కువనే చెప్పాలి.
వీరిద్దరి మధ్య తేడా ఏంటంటే.. గత ప్రభుత్వం చేపట్టిన కొన్ని మంచి పథకాలను కొనసాగించడం. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు, ఏపీలో అన్న క్యాంటీన్లు పేదల ఆకలి కోసం ఏర్పాటు చేసినవి. వీటిలో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఉండవు. కానీ జగన్ అధికారం చేపట్టిన వెంటనే అన్నా క్యాంటీన్లను తొలగించగా.. స్టాలిన్ మాత్రం ప్రభుత్వంపై ఎలాంటి భారం పడకుండా ఉండేందుకు అమ్మ క్యాంటీన్లను కొనసాగించారు. మరో విషయం ఏంటంటే.. ఏపీలో టీడీపీ హయాంలో విద్యార్థులకు ఇచ్చేందుకు వేల సంఖ్యలో సైకిళ్లను కొనుగోలు చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల వాటిని పంపిణీ చేయలేదు. అంతలో ప్రభుత్వం మారిపోయింది. జగన్ అధికారంలోకి వచ్చాక ఆ సైకిళ్లను విద్యార్థులకు ఇస్తే బాగుండేది. కానీ వాటిని మూలన పడేశారు. అదే తమిళనాడు విషయానికి వచ్చేసరికి పిల్లలకు అందించే పుస్తకాలపై మాజీ సీఎం జయలలిత ఫొటోలు ఉండగా, స్టాలిన్ ప్రభుత్వం అలానే వాటిని పిల్లలకు పంపిణీ చేసి శభాష్ అనిపించుకుంది. ఇంకా ఇలాంటి కొన్ని విషయాలలో జగన్, స్టాలిన్‌కు పోలికలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.