దేశమంతటా కరోనా వైరస్ కారణంగా చాలారోజుల పాటు థియేటర్లు మూతపడ్డాయి. అయితే కరోనా తగ్గుముఖం పడుతుండటంతో అన్ని ప్రాంతాల్లో క్రమంగా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. దేశమంతటా కరోనా ప్రభావం దాదాపు ఒకేలా ఉన్నా సినిమాల రిలీజ్‌ల విషయంలో టాలీవుడ్ అత్యుత్సాహం చూపిస్తోంది. తొలుత రిలీజ్ డేట్ ప్రకటించి.. మళ్లీ వాయిదా వేసి.. మళ్లీ రిలీజ్ డేట్ ప్రకటించి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల జీవితాలతో పలు సినిమాల నిర్మాతలు ఆడుకుంటున్నారు.
ఈ జాబితాలో తొలుత చెప్పుకోవాల్సిన సినిమా ఆర్.ఆర్.ఆర్. ఇప్పటికే ఈ సినిమా కంప్లీట్ అయిపోయింది. అక్టోబర్ 13 విడుదల ఖాయమని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల కావడం లేదని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా విడుదలకు సవాలక్ష కారణాలు ఉండొచ్చు. పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇతర ప్రాంతాల్లో థియేటర్ల ఎవైల్బులిటీ, ఏపీలో టిక్కెట్ల రేట్లు.. ఇలా కారణాలను పలువురు విశ్లేషిస్తున్నారు. మరి అలాంటప్పుడు అధికారిక ప్రకటన ఇస్తే తప్పేముంది? కానీ నిర్మాత డీవీవీ దానయ్య ఆ విషయాన్ని గాలికొదిలేశాడు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఇప్పటికే చాలా సినిమాలు సంక్రాంతి విడుదల తేదీలను టార్గెట్ చేశాయి. రాధేశ్యామ్, భీమ్లా నాయక్, సర్కారు వారి పాటతో పాటు ఎఫ్ 3, ఆచార్య వంటి సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కూడా సంక్రాంతికే వస్తుందని టాక్ నడుస్తోంది. దీంతో పలు సినిమాల రిలీజ్ డేట్లు గందరగోళంలో పడ్డాయి. ఆర్.ఆర్.ఆర్ కారణంగా అటు అక్టోబర్ 13న విడుదల చేయలేక.. ఇటు సంక్రాంతికి విడుదల చేయలేక తమ సినిమాలను ఏం చేయాలో తెలియని పరిస్థితిలో టాలీవుడ్ నిర్మాతలు ఉన్నారు.
ఈ జాబితాలో చెప్పుకోవాల్సిన రెండో సినిమా లవ్‌స్టోరీ. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాతకు ఏం ప్రాబ్లమో అర్థం కావడం లేదు. అప్పట్లో కరోనా సెకండ్ వేవ్ అని తప్పించుకున్నారు. తీరా థియేటర్లు తెరిచాక విడుదల చేశారా అంటే అదీ లేదు. ఎట్టకేలకు వినాయకచవితిని టార్గెట్ చేశారు. ఇప్పుడు వీళ్లకు ఓటీటీలో రిలీజ్ అయ్యే టక్ జగదీష్ బూచిగా మారింది. దీంతో మళ్లీ ఈ మూవీ అక్టోబర్‌కు వాయిదా పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసే ఉద్దేశం నిర్మాతకు ఉందో లేదో తెలియడం లేదు. మంచి సినిమాలు వస్తేనే థియేటర్లకు వెళ్లాలని ప్రేక్షకులు భీష్మించుకుని కూర్చుంటే.. ఇలా చిన్న, పెద్దా సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ థియేటర్లకు నష్టం చేకూరుస్తున్నాయి. వీరి దెబ్బతో ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడేలా ఉన్నారు. తప్పంతా నిర్మాతల దగ్గర పెట్టుకుని ఓటీటీల మీద నెపం వేసే నికృష్టపు రాజకీయాలు చేస్తున్నారు మన సినీ పెద్దలు.