ఆప్ఘనిస్తాన్‌లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. తాలిబన్లు రెచ్చిపోతుండటంతో అక్కడి ప్రజలు భయంతో వేరే దేశాలకు పారిపోతున్నారు. తొలుత తాము ఎవరికి ఎలాంటి అపకారం చేయమని చెప్పిన తాలిబన్లు.. అందుకు భిన్నంగా హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. తమ ప్రత్యర్థులని భావించిన వారిని.. తమ మాటల్ని వినని వారిని ఊచకోత కోసేస్తున్నారు. దీనికి కారణం అమెరికా అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. అమెరికా తన సైన్యం వెనక్కి తీసుకోవడంతోనే ఈ పరిస్థితులు దాపురించాయని విమర్శలు చేస్తున్నారు.
అయితే ఆప్ఘన్లు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి తెలుగు యువహీరో నిఖిల్ చలించిపోయినట్లు ఉన్నాడు. దీంతో అమెరికా అధ్యక్షుడిపై ఓ ఘాటు ట్వీట్ చేశాడు. ‘స్వేచ్ఛా ప్రపంచం అనే దానికి ఉదాహరణ అమెరికా. కానీ.. అదిప్పుడు పోయింది. 21 ఏళ్లుగా ఎన్నో కష్టాలు పెట్టారు. ఇప్పుడు ఇలా పారిపోయారు. నువ్వు ఇంకెప్పుడైనా స్వాతంత్య్రం గురించి మాట్లాడితే.. జో బైడెన్ చెప్పు తెగుద్ది (ఈ మాటల్ని మాత్రం ఇంగ్లీష్‌లో రాశాడు) అంటూ నిఖిల్ ఫైర్ అయ్యాడు.