VISHWAKSEN PAGAL MOVIE REVIEW AND RATING
రేటింగ్: 2.5/5
టాలీవుడ్‌లో టాలెంటెడ్ హీరోల్లో విశ్వక్‌సేన్ ఒకడు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ‘ఫలక్‌నుమా దాస్’, ‘హిట్’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఇటీవల ‘పాగల్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అతడు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా పై ఎంతో నమ్మకంగా చెప్తున్నట్లు తెగ బిల్డప్ ఇచ్చాడు. ఈ సినిమా బాగోకపోతే తన పేరు మార్చుకుంటానన్నాడు. ఇప్పుడు అతడి కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని తేలిపోయింది. ‘పాగల్’ మూవీ రొటీన్ సినిమాల్లో ఒకటిగా మిగిలిపోయింది. బొమ్మరిల్లులా మేజిక్ చేస్తుందని భావించిన ఈ సినిమాకు అంత సీన్ లేదని ఫస్ట్ షోతో స్సష్టమైపోయింది.
ఇక కథలోకి వెళ్తే… హీరో ప్రేమ్ (విశ్వక్ సేన్) తనకు అమ్మలాగా ప్రేమను పంచేవారు ఎవరూ ఉండరని నమ్ముతాడు. ఎందుకంటే తల్లి (భూమిక)తో చిన్నప్పుడే ఎంతో అనుబంధం ఏర్పరుచుకుంటాడు. అయితే దురదృష్టవశాత్తూ ఆమె క్యాన్సర్‌తో చనిపోతుంది. కానీ చనిపోతూ తల్లి అతడికి ఓ మాట చెప్తుంది. ఎవరినైనా మనం ప్రేమిస్తే వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమిస్తారు అని. దీంతో ప్రేమ్ తనకు కనిపించిన ప్రతి అమ్మాయిని ప్రేమిస్తూ పోతాడు. కానీ అందరూ ప్రేమ్ ప్రేమని తిరస్కరిస్తారు. అయితే చివరకు తీర (నివేదా పెతురాజ్) అతడి ప్రేమను ఒప్పుకుంటుంది. అయితే వీరి ప్రయాణం ఎక్కడి వరకు వెళ్లిందన్నదే మిగతా కథ.
విశ్వక్‌సేన్ మంచి నటుడే అని మరోసారి ఈ సినిమాతో నిరూపితమైంది. కామెడీ, సెంటిమెంట్ సన్నివేశాల్లో అతడు అద్భుతంగా నటించాడు. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. నివేదా పెతురాజ్ కూడా అతడికి సాయం చేసింది. అయితే కథ, కథనాల్లో దర్శకుడు గతి తప్పడంతో ఈ సినిమా కూడా బోరింగ్‌గా తయారైంది. కథ మొదలై ఎంత సేపు అవుతున్నా కూడా అమ్మాయిలు మారుతారు తప్ప కథనం మారనట్టు అనిపిస్తుంది. మధ్యలో వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నా సినిమాలో మెయిన్ థీమ్‌లో ఫీల్ మిస్ ఫైర్ అయ్యింది. ముఖ్యంగా తల్లి, కొడుకు సన్నివేశాల్లో ఎమోషన్ పండలేదు. అలాగే రొమాంటిక్ సన్నివేశాల్లోనూ లాజిక్ మిస్సయింది. అయితే రాజకీయ నేతగా మురళీశర్మ నటన బాగున్నా అతడితో ‘గే’ సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌ను దర్శకుడు నరేష్ కుప్పిలి ఏదోలా నడిపించినా సెకండాఫ్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఇక క్లైమాక్స్ మరీ రొటీన్‌గా ఉంది. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.
ఈ సినిమాలో రెండు పాటలు మాత్రం బాగున్నాయి. గూగుల్.. గూగుల్, ఈ సింపుల్ చిన్నోడు అంటూ సాగే పాటలకు రథన్ మంచి సంగీతం సమకూర్చాడు. బీజీఎం కూడా ఫర్వాలేదు. ఎస్. మణికందన్ సినమాటోగ్రఫీ బాగుంది. దిల్ రాజు సంస్థ, లక్కీ మీడియా సంస్థల నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. దర్శకుడు ఎమోషనల్ అండ్ లవ్ డ్రామా కథను ఎంచుకున్నా అతడి పనితనమే ఈ సినిమాకు పెద్ద మైనస్. ఏదో అనుకుంటే మరేదో అయినట్లు ఈ సినిమా స్క్రీన్‌ప్లే తయారైంది.
చివరగా.. బాక్సాఫీస్‌కు పాగల్ సినిమా ఊపును తెస్తుందని ఊహించిన వారి ఆశలను ఈ సినిమా అడియాశలు చేసిందనే చెప్పాలి. ప్రేమ వ్యవహారంతో చాలా సినిమాలు వచ్చాయి. రొటీన్ కామెడీతో ఈ సినిమాను గట్టెక్కించాలని చూసినా ప్రేక్షకులకు బోరింగ్‌గా తయారైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాగల్ బాక్సాఫీస్ వద్ద పాస్ కావడం కష్టమనే చెప్పాలి. దిల్ రాజు బ్యానర్‌లో మరో సక్సెస్‌ను ‘పాగల్’ అందించడం కష్టమేననిపిస్తోంది.
A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: మల్లికార్జున (కూకట్‌పల్లి)