Breaking News

టోక్యో ఒలింపిక్స్: ఒక్క మగాడు.. చరిత్రనే మార్చాడు

1 0

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తొలిసారిగా స్వర్ణ పతకం సాధించింది. అది కూడా జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా భారత్‌కు గోల్డ్ మెడల్ అందించాడు. ఫైనల్ మొదటి రౌండులో 87.03 మీటర్ల దూరం జావెలిన్ విసిరి మొదటి స్థానానికి దూసుకు వెళ్ళాడు. అనంతరం జరిగిన పోటీల్లో 87.58 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. వందేళ్ల తర్వాత అథ్లెటిక్స్‌లో భారత్‌కు పసిడి తెచ్చిన ఆటగాడిగా నీరజ్ చోప్రా రికార్డులకెక్కాడు. ఈ పతకంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 7కి చేరింది. ఇందులో ఒక బంగారు పతకం, రెండు సిల్వర్, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. కాగా ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు భారత్ పాల్గొన్న అన్ని ఒలింపిక్స్‌ పోటీల కంటే ఎక్కువ పతకాలు టోక్యోలోనే వచ్చాయి. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 6 పతకాలు (2 సిల్వర్, 4 కాంస్యం) రాగా ఈసారి ఇప్పటివరకు ఏడు మెడల్స్ వచ్చాయి.

మరోవైపు భారత్‌కు గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజకీయ నాయకుల నుంచి చిత్ర పరిశ్రమ ప్రముఖుల వరకు అందరూ గోల్డ్ మోడల్ విజేత నీరజ్ చోప్రాను అభినందిస్తున్నారు. భారత దేశాన్ని ప్రపంచానికి మరోసారి గర్వపడేలా చూపించాడని కొనియాడుతున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ చోప్రాను అభినందించారు. నీరజ్ అపూర్వ విజయం సాధించాడని, భావితరాలకు అతని గెలుపు స్ఫూర్తిని నింపుతుందని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. నీరజ్ చోప్రా గెలుపు ఎప్పటికీ మరువలేనిదని ప్రధాని మోదీ అభినందించారు. నీరజ్ అసమాన పోరాట పటిమ ప్రదర్శించాడని కొనియాడారు. ఈ నేపథ్యంలోనే నీరజ చోప్రాకు హర్యానా సర్కారు భారీ నజరానా ప్రకటించింది. రూ. 6 కోట్ల నగదుతో పాటు గ్రూప్ -1 క్యాడర్ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది హర్యానా సర్కార్. అలాగే 50 శాతం రాయితీతో కూడిన ఇంటిస్థలం కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది.

కాగా గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా 12 ఏళ్ల వయసులో 90 కిలోల బరువు ఉండేవాడు. జాగింగ్, ఎక్సర్‌సైజ్ చేయమని చెబితే వినేవాడు కాదు. ఫిట్‌నెస్ గురించి అస్సలు పట్టించుకోకపోయేవాడు. ఓసారి అమ్మ మందలించడంతో జాగింగ్ చేసేందుకు వెళ్లాడు. మైదానంలో జావెలిన్ త్రో ప్లేయర్ జై చౌధరీ చోప్రాతో జావెలిన్ త్రో విసిరించాడు. తొలిసారే 35-40 మీ. విసరగానే అందులో ట్రైనింగ్ తీసుకోవాలని నీరజ్ డిసైడ్ అయ్యాడు. బరువు తగ్గి ఆటపై దృష్టి పెట్టాడు.